జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం పై ప్రతిపక్షాల గోలేమిటో అర్థం కావటం లేదు. మంత్రివర్గంలో ఎవరుండాలి ? ఎవరిని తీసేయాలనేది పూర్తిగా జగన్ ఇష్టం. మంత్రివర్గం మార్పులు, చేర్పులనేది నూరుశాతం అధికార పార్టీ అంతర్గత విషయం. సమస్యలు, అసంతృప్తులుంటే అది జగన్, మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఇతర పార్టీలకు ఏ మాత్రం లేదు. కానీ ఈ విషయంలో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి.
టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తీసేసిన మంత్రులను ఎందుకు తీసేశారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. అచ్చెన్నకు జగన్ అసలు ఎందుకు సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. టీడీపీ హయాంలో మంత్రులను ఎందుకు తీసేసింది చంద్రబాబు నాయుడు జనాలకు కానీ లేదా ప్రతిపక్షాలకు కానీ సమాధానం చెప్పారా ?
అలాగే బీసీలను జగన్ మోసం చేసినట్లు పదే పదే ఆరోపించటంలో కూడా అర్ధం లేదు. తాము మోసపోయామని బీసీలు అనుకుంటే వాళ్ళే జగన్ కు బుద్ధి చెబుతారు. మధ్యలో అచ్చెన్నకు వచ్చిన సమస్యేమిటి ? తమ హయాంలో ఎంతమంది బీసీలకు మంత్రిపదవులిచ్చింది, ఎన్నికల సమయంలో ఎంతమంది బీసీలకు ఎంపీ, ఎంఎల్ఏల టికెట్లిచ్చారో చెప్పుకోవచ్చు కదా. ఆ విషయం చెప్పకుండా బీసీలను జగన్ మోసం చేశారని గోల చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఇక బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గోల మరోరకంగా ఉంది. బీసీలపైన జగన్ కు నిజంగానే అంత ప్రేముంటే వెంటనే సీఎం కుర్చీలో ఒక బీసీ నేతను కూర్చోబెట్టాలట. జగన్ ఉపముఖ్యమంత్రిగా ఉండాలట. కేవలం అధికారంలోకి రావటానికి మాత్రమే బీసీలను జగన్ ఉపయోగించుకుంటున్నారట. మళ్ళీ అధికారంలోకి రావాలనే దురుద్దేశ్యంతోనే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు జగన్ చెప్పుకుంటున్నారట.
విచిత్రం ఏమిటంటే మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకోవటం దురుద్దేశ్యం ఎలాగవుతుందో వీర్రాజే చెప్పాలి. వీర్రాజు చెప్పిందే నిజమైతే నరేంద్ర మోడి రెండోసారి అధికారంలోకి ఎందుకు వచ్చినట్లు ? వచ్చే ఎన్నికల్లో ఏపీలో తామే అధికారంలోకి వచ్చేస్తామని వీర్రాజు ఎందుకు చెబుతున్నట్లు ? ఏమిటో మొత్తానికి జగన్ పై ఉన్న అక్కసుతో ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయి.