ఈ రోజుల్లో అవినీతి ఆరోపణల కంటే కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ నాయకుల ఇమేజ్‌ను ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటాయి. మహిళల్ని లైంగికంగా వేధించినా, శృంగారం జరిపినా.. లేక సరస సంభాషణలు చేసినా.. వాటి తాలూకు ఆడియోలు, వీడియోలు రిలీజయ్యాయంటే అంతే సంగతులు. ఇమేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. జనాల్లో ఏహ్య భావం కలుగుతుంది. సోషల్ మీడియాకు ఇలాంటి కంటెంట్ దొరికితే పరువు గంగలో కలిసిపోతుంది.
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి ఉదంతాలను ఉపేక్షించదు. పార్టీకి జరిగే డ్యామేజ్‌ను దృష్టిలో ఉంచుకుని అలాంటి నేతల్ని పక్కన పెడుతుంది. లేదా సస్పెండ్ చేస్తుంది. ఐతే ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇలాంటి ఉదంతాలను లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. పార్టీకి అవసరమైన నేతల విషయంలో ఇలాంటివి చోటు చేసుకున్నా చూసీ చూడనట్లే ఉంటోంది.
గత ఏడాది వైకాపా నేతలు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌లవి అంటూ రెండు ఆడియోలు సోషల్ మీడియాలో తెగ తిరిగాయి. ఆ నేతలు మహిళలతో సరస సంభాషణలు చేసినట్లుగా ఉన్న ఆడియోలవి. ఐతే ఆ ఆడియోల్లో వినిపిస్తున్నది తమ వాయిస్ కాదని, ఇదంతా కుట్ర అని ఈ ఇద్దరు నేతలూ వివరణ ఇచ్చుకున్నారు. ఆరోపణలను ఖండించారు. ఐతే టీడీపీ, జనసేన మద్దతుదారులైతే ఈ ఆడియోలతో పండగ చేసుకున్నారు. అవంతి, అంబటిలను తెగ ట్రోల్ చేశారు. ఇప్పటికీ వారి ప్రస్తావన వస్తే.. ఆడియోల్లో పాపులర్ అయిన మాటలతో ఆటాడేసుకుంటున్నారు.
ఐతే ఈ ఆడియోల వ్యవహారాన్ని వైకాపా అధిష్టానం పట్టించుకోనట్లే కనిపించింది. అవంతికి అప్పుడేమీ పదవీ గండం తలెత్తలేదు. ఇప్పుడు అంబటి ఏమో మంత్రి అయ్యారు. దీంతో ఇలాంటి ఆరోపణలు వైకాపాకు పట్టవేమో అన్న అభిప్రాయం జనాలకు కలుగుతోంది. కానీ కమెడియన్ టర్న్డ్ పొలిటీషియన్ పృథ్వీ విషయంలో మాత్రం వైకాపా దీనికి భిన్నంగా వ్యవహరించింది.
అప్పట్లో ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్‌గా ఉండగా పృథ్వీ ఒక మహిళతో జరిపిన సరస సంభాషణ అంటూ ఒక ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియో బయటికి వచ్చిన కొన్ని రోజులకే పృథ్వీ పదవి ఊడింది. అప్పుడు ఆ ఆడియో వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకున్న వైకాపా పెద్దలు.. తర్వాత అవంతి, అంబటిల విషయంలో ఎందుకు ఊరుకున్నట్లు? వాళ్ల ఆడియోలు ఫేక్ అని, వాటిలో నిజం లేదని అనుకున్నపుడు.. పృథ్వీ విషయంలో మాత్రం ఎందుకు అంత కఠినంగా వ్యవహరించినట్లు? అంటే రాజకీయంగా బలమైన నేపథ్యం, పార్టీకి అవసరం అనుకుంటే ఒక రకంగా.. లేదంటే ఇంకో రకంగా వ్యవహరిస్తారన్నమాట. ఈ తత్వం బోధపడే పృథ్వీ ఇటీవల ఒకప్పటి తన మిడిసిపాటు పట్ల క్షమాపణలు చెబుతూ, రాజకీయాలకు ఓ దండం అనేసినట్లున్నాడు.