ఆంధ్రాలో కరెంట్ కోతలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టీడీపీ సర్కారులో విద్యుత్ కోతలకు తావే లేదని వారంతా ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. పోనీ రాజకీయం ఎలా ఉన్నా నాణ్యతతో కూడిన విద్యుత్ అందిస్తామని చెప్పిన సీఎం జగన్ ఎందుకనో ఆ మాట మరిచిపోతున్నారన్న సందేహాలు
వినియోగదారుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
రానున్నది పరీక్షల సమయం కనుక టెన్త్, ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని కోతలు నివారించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. మరోవైపు అత్యవసర సేవలయిన ఆస్పత్రులకు కూడా పవర్ కట్స్ తప్పడం లేదు. దీంతో కొవ్వొత్తుల వెలుగులో దోమలతో యుద్ధం చేస్తూ జీవన్మరణ పోరాటంలో రోగులు ఉంటున్నారన్న ఆవేదన ఒకటి సంబంధిత వర్గాల నుంచి వినవస్తోంది. కోతల నివారణకు తక్షణ చర్యలు తీసుకోకుండా కేవలం ప్రకటనలు మాత్రమే పరిమితం అయితే ప్రయోజనం ఉండదని, వలంటీర్లకు వందనం అంటూ రెండేళ్ల కాల వ్యవధిలో 460 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించిన జగన్ సర్కారు ఎందుకని విద్యుత్ వినియోగం విషయమై బొక్కబోర్లా పడుతోందని టీడీపీ ప్రశ్నిస్తోంది.
ఈ నేపథ్యంలో పరిశ్రమలకు సంబంధించి పవర్ హాలీడే ను ఆదివారం ప్రకటించిన విధంగానే మరో రోజు కూడా సెలవు రోజుగా ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది. నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు సైతం విద్యుత్ విషయమై పొదుపు చర్యలు పాటించాలని ఆదేశించిందని ప్రధాన మీడియాలో వార్తలు వెలుగు చూశాయి. దీంతో పరిశ్రమలకు ఇకపై చీకటి రోజులే అని తేలిపోయింది. ఇప్పటికే కరోనా సృష్టించిన విలయం నుంచి తేరుకోక మునుపే ప్రభుత్వం మరో పిడుగుపాటు లాంటి వార్త చెప్పడం భావ్యం కాదని పరిశ్రమ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. సరిగా పనుల్లేక కూలీల జీవితాలపై తీవ్ర ప్రభావం ఉందని కూడా అంటోంది సంబంధిత యాజమాన్యం.
ఇవన్నీ మీడియాలో వస్తున్న నిజాలు. కానీ వీటిని ఒప్పుకోకుండా తాము అంతా మంచే చేస్తున్నాం అంటే చెప్పేదేం లేదు. చేసేదేం లేదు. వీలున్నంత మేర బొగ్గు నిల్వలు పెంచేందుకు తదనుగుణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ దిశగా ఇప్పటిదాకా అడుగులు పడలేదనే తెలుస్తోంది. ఈ నెల కరెంట్ బిల్లులు కూడా మోత మోగించనున్నాయి. తద్వారా 1400 కోట్లు రూపాయలు పిండుకోవడం ఖాయం. అయినప్పటికీ ఛార్జీల బాదుడు ఉన్నప్పటికీ సరఫరాలో అంతరాయాలను ఎందుకని నిలువరించలేకపోతున్నారని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని టీడీపీ సంధిస్తున్న ప్రశ్నాస్త్రం.