ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. అవికూడా జగన్ మార్క్ జిల్లాలుగా ఏర్పాటు కావడం గమనార్హం అంటున్నారు పరిశీలకులు. సోమవారం ఉదయం కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ వర్చువల్గా ప్రారంభించారు. దీంతో నేటి నుంచి రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని తెలిపారు. పలు జిల్లాలకు ముఖ్య పట్టణాలు మారాయన్నారు. ఏపీ జిల్లాలు 13 నుంచి 26కు పెంచినట్లు ప్రకటించారు.
పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు జరుగనున్నట్లు చెప్పారు. నిన్నటి వరకు సగటు జిల్లా జనాభా 38.15 లక్షలు అని, ఇంతటి ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలు ఉన్నవి ఏపీలోనే అని అన్నారు. ఇప్పుడు జిల్లా సగటు జనాభా 19.07 లక్షలు అని వెల్లడించారు. 18 లక్షల నుంచి 23 లక్షల జనాభా ఉండేలా జిల్లాల విభజన జరిగిందన్నారు.
రెవెన్యూ డివిజన్లను 51 నుంచి 72కు పెంచడం జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతల స్వీకరించారు. పునర్విభజన తర్వాత రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కు చేరింది.“రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు. 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపు మారింది. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి, 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకున్నాం. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పడింది. 1979 జూన్లో విజయనగరం జిల్లా ఏర్పడింది. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగింది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు అవసరం. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలి“ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను దాదాపుగా పరిగణనలోకి తీసుకొని, ఏపీ జిల్లాల ఏర్పాటు-1974 సెక్షన్ 3(5) నిబంధన ప్రకారం ప్రభుత్వం పునర్విభజన చేపట్టింది. దీనిపై గత జనవరి 25న ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడింది. అభ్యంతరాలు, సలహాలు, సూచనల తర్వాత తుది నోటిఫికేషన్లు ఇచ్చేందుకు 68 రోజుల సమయం పట్టింది. ప్రణాళిక సంఘం, రెవెన్యూ, ఆర్అండ్బీ, సాధారణ పరిపాలన విభాగం, ఆర్థిక శాఖలు ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించాయి. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు అయితే.. పూర్తయింది. మరి పాలనలో కొత్తదనం కనిపిస్తుందా? అనేది చూడాలని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates