త్వరలోనే జరగనున్న కేబినెట్ ప్రక్షాళనపై వైసీపీ నేతలు.. ఎవరికి వారు ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. మాకంటే.. మాకేనని లెక్కలు.. కూడా వేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ.. మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కూడా లెక్కలు తీవ్రంగానే వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి మొత్తం 20 మందిని కొత్తగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎస్సీ నాయకుడు.. వివాద రహితుడు కృష్ణాజిల్లా తిరువూరు ఎమ్మెల్యే.. రక్షణ నిధికి హోం శాఖ పగ్గాలు పగ్గాలు అప్పగిస్తున్నట్టు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఇక, జిల్లాల వారీగా చూస్తే..
శ్రీకాకుళం జిల్లా నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంత్రిమండలిలో చోటు దక్కనుందని సీనియర్లుచెబుతున్నారు. శాసనసభాపతి పదవికి ధర్మాన ప్రసాదరావును తీసుకుంటున్నట్టు సమాచారం. జిల్లా నుంచి మహిళా కోటాలో వైఎస్ కుటుంబానికి సన్నిహిత ఫ్యామిలీ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేరు వినిపిస్తోంది. విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామికి వైశ్యకోటాలో పదవి ఖాయమని అంటున్నారు.
కొత్తగా ఏర్పడనున్న మన్యం జిల్లాలో పీడిక రాజన్నదొర, విశ్వాసరాయి కళావతిలలో ఒకరికి తప్పకుండా ఛాన్స్ దక్కుతుంది. కళావతికి సీఎం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొట్టిగుళ్ల భాగ్యలక్ష్మికి మంత్రిమండలిలో స్థానంఖాయమని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా నుంచి ఫైర్ బ్రాండ్ యువ నాయకుడు.. కాపు కోటాలో గుడివాడ అమర్నాథ్‌కు పీఠం ఖాయం.
విశాఖపట్నం జిల్లాలో ఈ సారి ఎవరికి అవకాశాలు రాకపొవచ్చు. ఇక,కొత్తగా ఏర్పడనున్న కాకినాడ నుంచి ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తూర్పుగోదావరి నుంచి కాపు కోటాలో జక్కంపూడి రాజా, ఎస్సీ కోటాలో తలారి వెంకట్రావు పేర్లు ఖాయమని అంటున్నారు. ఏలూరు జిల్లా నుంచి ఎస్టీ కోటాలో తెల్లం బాలరాజు పేరు ఖరారైనట్టు తెలిసింది.
ఇక, అందరికంటే ముఖ్యంగా నరసాపురం నుంచి ముదునూరి ప్రసాదరాజుకు సీటు ఎప్పుడో రిజర్వ్ చేశారు. కృష్ణాజిల్లా నుంచి కొలుసు పార్థసారథి, జోగి రమేష్ పోటీలో ఉన్నా జోగికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎస్సీ కోటాలో కొక్కిలిగడ్డ రక్షణనిధిని తీసుకుంటున్నారు. ఈయనకు హోం శాఖ ఇస్తున్నట్టు తెలుస్తోంది. బ్రాహ్మణ కోటాలో మల్లాది విష్ణుకు కూడా ఛాన్స్ ఉంది.
గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందున్నారు. ఈయనకు జగన్ గతం లో ఆశలు కూడా కల్పించారు. ఒకవేళ మైనారిటీలకు ఇస్తే గుంటూరు ఈస్ట్ నేత మహమ్మద్ ముస్తఫాషేక్ కు అవకాశం రావచ్చు. పల్నాడు జిల్లా నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఛాన్స్ వచ్చే అవకాశం పెద్దగా కనిపించడం లేదు. మహిళా కోటాలో బీసీ నేత విడదల రజనికి ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా బ్రాహ్మణ కోటాలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప నుంచి ఇటీవల ఎన్నికైన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధను ఎస్సీ కోటాలో తీసుకుంటారని తెలుస్తోంది. కొత్తగా ఏర్పడనున్న అన్నమయ్య జిల్లా నుంచి కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులుకు ఛాన్స్ దక్కనుది. చిత్తూరు జిల్లా నుంచి మంత్రి పెద్దిరెడ్డిని కొనసాగిస్తున్నారు.
ఇప్పటి వరకు ఖాయమైన పేర్లు..
ముదునూరు ప్రసాదరాజు(క్షత్రియ)-నరసాపురం
మల్లాది విష్ణు(బ్రాహ్మణ)-విజయవాడ సెంట్రల్
సుధ(ఎస్సీ)-బద్వేల్(కడప)
రక్షణనిధి(ఎస్సీ)-తిరువూరు(ఎన్టీఆర్ జిల్లా)
రెడ్డి శాంతి(బీసీ)-పాతపట్నం(శ్రీకాకుళం)
విశ్వసరాయి కళావతి(ఎస్టీ)-విజయనగరం
తెల్లం బాలరాజు(ఎస్టీ)-పోలవరం
ముస్తఫా(మైనారిటీ)-గుంటూరు ఈస్ట్
విడదల రజనీ(బీసీ)-గుంటూరు(చిలకలూరిపేట)