2019 ఎన్నికల్లో విజయం తర్వాత టీడీపీని కాదని వైసీపీకి మద్దతుగా నిలబడ్డ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇబ్బందులు తప్పేలా లేవు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం.. ఒకవేళ ఎన్నికల్లో నిలబడ్డా వైసీపీ తరపున గెలవడం అంత సులభంగా కనిపించడం లేదు. గన్నవరంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ వర్గం వంశీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. వంశీ చేరికతో గన్నవరంలో వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని, ఒకవేళ ఇచ్చినా ఆయన గెలవడని హెచ్చరిస్తూ వంశీ వ్యతిరేక వర్గం విజయసాయిరెడ్డికి లేఖ రాసింది. ఇప్పుడీ లేఖ చర్చనీయాంశంగా మారింది.
మొదటి నుంచి..
గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. టీడీపీకి దూరంగా ఉంటూ వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన గన్నవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేయడం ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆ సీటు వంశీదేనంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంశీ.. వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావును ఓడించారు. 2019లో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై వంశీ విజయం సాధించారు. ఆ తర్వాత జగన్‌కు వంశీ జై కొట్టారు. కానీ గన్నవరంలో ఉన్న స్థానిక వైసీపీ నేతలకు మాత్రం ఈ పరిణామంతో ఇబ్బంది మొదలైంది. వంశీని వైసీపీ నేతగా అక్కడి నాయకులు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదని సమాచారం. గతంలో వంశీ వ్యతిరేక వర్గంతో జగన్ మాట్లాడి సర్దిచెప్పినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది.
ఎవరైనా సరే..
తాజాగా వంశీకి పార్టీ టికెట్ ఇవ్వొద్దంటూ విజయసాయిరెడ్డికి వైసీపీ వర్గం లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇప్పుడా లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందరినీ కలుపుకొని పోతానంటూ పార్టీకి మద్దతుగా నిలబడ్డ వంశీ వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. వంశీకి టికెట్ ఇవ్వొద్దని, ఒకవేళ ఇచ్చినా ఆయన గెలవరంటూ వైసీపీ వర్గం హెచ్చరించింది. వంశీకి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా 30 వేల మెజారిటీతో గెలిపించుకుంటామని కూడా హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగా గన్నవరంలో పార్టీకి కొత్త ఇంఛార్జీని నియమించాలని కోరింది. దుట్టా రామచంద్రరావు వర్గమే ఇలా లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జగన్ జిందాబాద్.. వంశీ డౌన్‌డౌన్ అనే నినాదాలతో ఇప్పటికే గన్నవరంలో ఆ వర్గం రెచ్చిపోతున్నట్లు సమాచారం. మరి వంశీ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates