ఢిల్లీకి రేవంత్‌.. సీనియ‌ర్ల‌కు చెక్ పెట్టేందుకేనా?

తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌లోపేతం కోసం ఓ వైపు తాను ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. త‌న‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న సీనియ‌ర్ నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రంలో పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌కుండా స‌ప‌రేటుగా స‌మావేశాలు పెట్టుకుంటున్న సీనియ‌ర్ల‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్లిన‌ట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌ను క‌లిసి సీనియ‌ర్ నేత‌ల వైఖ‌రిపై రేవంత్ ఫిర్యాదు చేస్తార‌ని స‌మాచారం. ఇటీవ‌ల రేవంత్ నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తూ వి.హ‌నుమంత‌రావు, జ‌గ్గారెడ్డి, మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి లాంటి అసంతృప్త నేత‌లు ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన సంగతి తెలిసిందే. మ‌రోవైపు కోమ‌టిరెడ్డి సోద‌రులు కూడా రేవంత్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ పార్టీ మారే ప్ర‌యత్నాల్లో ప‌డ్డారు.

జ‌గ్గారెడ్డి విష‌యంలో..
తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం నియ‌మించ‌డంతో పార్టీలోని సీనియ‌ర్ల అసంతృప్తి బ‌య‌ట‌ప‌డింది. మొద‌టి నుంచి పార్టీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌ను వ‌దిలేసి.. వేరే పార్టీ నుంచి వ‌చ్చిన రేవంత్‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంపై సీనియ‌ర్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్ప‌టి నుంచి రేవంత్‌తో అంటిముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక రేవంత్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నార‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల గురించి క‌నీస స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌కటించి ఆ త‌ర్వాత దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడేమో రేవంత్‌పై పోరుకు ఇత‌ర సీనియ‌ర్ల‌తో క‌లిసి సై అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ్గారెడ్డికి టీపీసీసీ షాకిచ్చింది. ఆయ‌న‌కు కేటాయించిన అద‌న‌పు బాధ్య‌త‌ల నుంచి జ‌గ్గారెడ్డిని తప్పించింది.

ఎలా సాగాల‌ని..
జ‌గ్గారెడ్డిని పార్టీకి సంబంధించిన అద‌న‌పు బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డంతో ఇక‌పై ఏ విధంగా ముందుకు సాగాల‌నే విష‌యంపై మ‌ణికం ఠాగూర్‌తో రేవంత్ చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. పార్టీ ప‌రిధి దాటి ఎవ‌రైనా ప్ర‌వ‌ర్తిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జ‌గ్గారెడ్డి ఉదంతంతో మిగిలిన సీనియ‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్ల‌యింది. దీంతో త‌న నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న మిగిలిన సీనియ‌ర్ నాయ‌కుల వైఖ‌రి ప‌ట్ల అవ‌లంబించాల్సిన విధానం గురించి ఠాగూర్‌తో రేవంత్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అస‌మ్మ‌తి నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో అధిష్ఠానం వెనక్కి తగ్గేదే లేద‌నే స్పష్ట‌మైన సూచ‌న‌లు సీనియ‌ర్ల‌కు చేరేలా రేవంత్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న సాగ‌నుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అధిష్ఠానం మద్ద‌తు ఎలాగో రేవంత్‌కే ఉంది కాబ‌ట్టి ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచి మిగిలిన నాయ‌కులు కూడా పార్టీ కోసం ప‌ని చేస్తే మేల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.