ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో గెలిచి తిరిగి అధికారం నిలబెట్టుకున్న బీజేపీ జోష్‌లో ఉంది. దేశంలో తమకు పోటీగా నిలిచే పార్టీయే లేదని కాషాయ దళం ధీమాగా చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు.. మోడీని ఇంటికి పంపేందుకు తాము ఏకమవుతున్నట్లు రెండు పార్టీలు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకునే మార్పు జరిగింది. శరద్ యాదవ్ చెందిన పార్టీ లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ).. లాలూ ప్రసాద్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో విలీనమైంది. విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని విలీనం చేస్తున్నామని శరద్ యాదవ్ పేర్కొనడం గమనార్హం.
25 ఏళ్ల తర్వాత..
ఇప్పుడు ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒక్కచోటుకు చేరారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలు ఒకేసారి రాజకీయ ప్రస్థానం మొదలెట్టారు. 1997 వరకు జనతాదళ్ పార్టీలో కలిసి పని చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన లాలూ సొంతంగా ఆర్జేడీని స్థాపించారు. మరోవైపు నితీశ్ కుమార్‌తో కలిసి శరద్ యాదవ్ జనతాదళ్ (యూ) స్థాపించారు. కానీ కొన్నేళ్ల కిందట ఆ పార్టీకి దూరమై లోక్‌తాంత్రిక్ జనతాదళ్ను నెలకొల్పారు. మళ్లీ ఇప్పుడు లాలూతోనే చేతులు కలిపారు.
ఒక్కటి చేసేందుకు..
కేంద్రంలోని బీజేపీపై పోరుకు దాని వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్.. అటు వైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించడం కోసం ఇప్పుడు ఆర్జేడీలో ఎల్జేడీ విలీనమవడం చర్చనీయాంశంగా మారింది. విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని విలీనం చేశామని చెప్పిన శరద్ యాదవ్.. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం పాలనలో దారుణంగా విఫలమైందని, బలమైన ప్రతిపక్షం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరి ఈ పార్టీల కలయికతో రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.