చైనాలో కుప్పకూలిన విమానం…133 మంది మృతి?

ప్రపంచ పౌర విమానయాన చరిత్రలో మరో ఘోర ప్రమాదం జరిగింది. నైరుతి చైనాలో 133 మంది ప్రయాణికులతో వెళుతోన్న విమానం కుప్పకూలింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం పెను ప్రమాదానికి గురైంది. పర్వతాల్లో హఠాత్తుగా విమానం కుప్పకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు శరవేగంగా సమీపంలోని అడవిలోకి వ్యాపించడంతో అక్కడ కార్చిచ్చు అంటుకుంది.

ఈ నేపథ్యంలోనే బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు చేయడం కష్టతరంగా మారింది. ప్రమాదం జరిగిన తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని రెస్క్యూ ఆపరేషన్ టీం అభిప్రాయపడుతోంది. సోమవారం మధ్యాహ్నం 1గంట తర్వాత గ్వాంగ్జూ రీజియన్‌లోని వుజుహ్ నగరం సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతంలోని టెంగ్ కౌంటీ వద్ద ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది.

కున్మింగ్ సిటీ నుంచి స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.00 గంటకు బయలుదేరిన విమానం.. గమ్యస్థానం గ్వాంగ్జూ‌కి నిర్దేశిత సమయానికి చేరుకోలేదని విమానాశ్రయ సిబ్బంది చెప్పారు. అయితే, ఈ ప్రమాద ఘటనపై స్పందించేందుకు చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నిరాకరించింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా చనిపోయారా? ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారణాలేమిటి? అన్న విషయాలపై పూర్తి అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.