మత ప్రాతిపదికన ఓ పార్టీ పెట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారా లేదా ఆమె భర్త అనిల్ ఇందుకు పావులు కదుపుతున్నారా? మహానేతగా పేరున్న వైఎస్సార్ కుటుంబంలో స్పర్థలే ఓ ప్రధాన మీడియా హైలెట్ చేస్తుంది తప్ప! వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నం అన్నది నిజమేనా ? ఇంకా చెప్పాలంటే ఏపీ చరిత్రలో మత ప్రాతిపదికన ఇప్పటిదాకా ఒక్కపార్టీ కూడా ఆరంభానికి నోచుకోలేదు.ఉమ్మడి ఆంధ్రాలో ఎంఐఎం (ఇప్పటి తెలంగాణలో) హవా చూపుతున్నా కూడా అది ఓ ప్రాంతానికే పరిమితం. ఆ ప్రాభవం పాత నగరానికే పరిమితం. అలాంటిది మైనార్టీ వర్గాలలో ఒక్కటైన క్రీస్టియన్లను ఆకర్షించి వారికో పార్టీ అంటూ తెరపైకి రావడం అన్నది నిజంగానే ఓ అనాలోచిత చర్య అన్నది రాజకీయ వర్గాలు చేస్తున్న వ్యాఖ్య.
గత ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ ఈ ఎన్నికల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని తహతహలాడుతోంది. అందుకు అనుగుణంగా రాజకీయం కూడా నడుపుతోంది. ఈ దశలో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా తీసుకువచ్చి కాస్తో కూస్తో తనకు అనుగుణంగా పరిణామాలను మార్చుకోవాలని చూస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తాము చీల్చమని చెబుతున్న పవన్ కు గట్టి కౌంటర్ నే ఇస్తోంది. ఆ విధంగా ఒకవేళ టీడీపీ,బీజేపీ,జనసేన పార్టీలు ఏక తాటిపైకి వచ్చి రాజకీయం చేసినా కూడా జగన్ కు వచ్చిన నష్టమేమీ లేదన్న భావనలో ఇవాళ వైసీపీ ఉంది.ముఖ్యంగా తాము ఏం చేసినా అదంతా ప్రజల కోసమే ప్రజల మంచి కోసమే వారి నుంచి మద్దతు పొందేందుకే అన్న తరహాలో వైసీపీ వ్యూహాలు స్థిరం అయి ఉన్నాయి.
స్థిరం అయిన రాజకీయ చతురత ఒకటి వీరంతా పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా పనిచేయని వారిని తప్పిస్తే ఎలా ఉంటుంది అన్న నిర్ణయానికి వస్తే ఇక రానున్న కాలంలో చాలా మంది ఇంటి బాట పట్టేందుకు అవకాశాలే కోకొల్లలు.ఆ విధంగా ఒక్క శ్రీకాకుళంలోనే ఐదుగురు ఎమ్మెల్యేలను తప్పించే అవకాశాలు ఉన్నాయి.అదేవిధంగా మిగతా ప్రాంతాలలో కూడా మొహమాటాలకు పోకుండా పార్టీ బలోపేతానికి సహకరించే శక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నారు.ఈ దశలో జగన్ ను నిలువరించేందుకు ఆయన ఇంటి నుంచే మరో రాజకీయ శక్తి బయలుదేరుతోంది.షర్మిల భర్త అనిల్ త్వరలో పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు ప్రధాన మీడియాలో వచ్చాయి.
ఇవేవీ నిజం కావని ఒకవేళ పార్టీ పెట్టినా కూడా ఇప్పటికిప్పుడు ఉన్న రెండేళ్లలో పుంజుకోవడం కష్టమేనని అంటున్నాయి వైసీపీ వర్గాలు. కేవలం వైఎస్సార్ కుటుంబంలో ఉన్న చిన్పపాటి స్పర్థలను చిలువలు పలువలు చేసి చూపించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కొందరు రాజకీయం నడుపుతున్నారని వైసీపీ అంటోంది. కానీ మరోవైపు క్రైస్తవులను ఏకం చేసేందుకు బ్రదర్ అనిల్ ప్రయత్నాలు చేయడం వెనుక అసలు వ్యూహం వేరుగా ఉందని తెలుస్తోంది.ఇందులో కూడా విపక్ష పార్టీల ప్రమేయం ఉంటే ఉండవచ్చని కూడా అంటున్నారు కొందరు రాజకీయ పరిశీలకులు.
గత ఎన్నికల్లో మాదిరిగా క్రైస్తవులు అంతా జగన్ వెంటే ఉంటారు అని అనుకోవడం కూడా పొరపాటేనని కొద్దో గొప్పో బ్రదర్ అనిల్ చేసిన సాయం కూడా వైసీపీకి ఎంతగానో ఉపయోగ పడిందన్నది జగన్ వర్గం మాట! కనుక కొత్త పార్టీలన్నవి ఊహాల్లో భాగాలు కానీ అవే వాస్తవాలు కావు కాబోవు అన్నది ఇవాళ వైసీపీ సుస్పష్ట రీతిలో చెబుతున్న మాట!