జ‌న‌సేన లోకి టీడీపీ నేత‌లు.. నిజ‌మేనా?

ఏపీలో రాజ‌కీయాలు మారుతున్నాయి. నాయ‌కులు ఎటు నుంచి ఎటైనా జంప్ చేసే ప‌రిణామాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. దీనికి ప్ర‌ధానంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారంలో నుంచి దింపేయ‌డ‌మే ల‌క్ష్యం! అది కూడా టీడీపీ నుంచే జంపింగులు ఉంటాయ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అదేంటి.. చిత్రంగా ఉందే! అనుకుం టున్నారా? అస‌లు విష‌యానికి వ‌స్తే.. వచ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో చిత్ర‌మైన పొత్తులు తెర‌మీదికి వ‌స్తున్నాయనే  సంకేతాలు వ‌చ్చాయి. ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో మాట్లాడు తూ.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల్చ‌కుండా చూస్తాన‌ని అన్నారు.

అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌నూ స‌మైక్యం చేసి.. మ‌హాకూట‌మిగా రంగంలోకి దిగిపోతున్నారనే సంకేతాల‌ను ఆయ‌న ఇచ్చేసిన‌ట్టేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌-వామ‌ప‌క్షాలు-ప్ర‌జాశాంతి లేదా.. చిన్నాచిత‌కా పార్టీలు అన్నీ ఒకే గొడుగు కింద‌కు వ‌స్తాయని భావించాలి. కానీ, బీజేపీ మాత్రం ఇప్ప‌టికీ.. టీడీపీతో క‌లిసేది లేద‌ని.. జ‌న‌సేన మాత్ర‌మే త‌మ విశ్వ‌స‌నీయ మిత్ర‌ప‌క్ష‌మ‌ని ప‌దే ప‌దే చెబుతోంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు ఎవ‌రితో పొత్తుకు దిగుతార‌నేది మ‌రో చ‌ర్చగా ఉంది. స‌రే.. ఏది ఎలా ఉన్నా.. టీడీపీ-జ‌న‌సేన మాత్రం ప‌క్కాగా క‌లిసిపోవ‌డం.. క‌ద‌నంలోకి దూకేడం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

అయితే.. ఇలా జ‌రిగినా.. ప‌వ‌న్‌ను న‌మ్మే ప‌రిస్థితి టీడీపీకి క‌నిపించ‌డం లేదు. ఆయ‌న ఎప్పుడు ఏం మాట్లా డతాడో.. లేక‌.. ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో.. చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌డు .. చంద్ర‌బాబు ఒక సానుకూల వ్యూహం వేస్తున్నార‌నే టాక్ టీడీపీలో వినిపిస్తోంది. అంటే.. టీడీపీ లోనే కొంద‌రు నాయ‌కులు బాబు ను వ్య‌తిరేకిస్తారు. ఆ వెంట‌నే.. బ‌ల‌మైన ప‌క్షంగా ఉందంటూ.. జ‌న‌సేన కు జై కొడ‌తారు. వీరిలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉండే అవ‌కాశం ఉంది. ఆవెంట‌నే వారు జ‌న‌సేన త‌ర‌ఫున‌.. టికెట్లు తెచ్చుకుని విజ‌యం ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేస్తారు.

రేపు ఒక‌వేళ‌.. టీడీపీ -జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం క‌నుక అధికారంలోకి వ‌చ్చేస్తే.. వీరికి మంత్రి ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెట్టే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ‌ మ‌ధ్య‌లో కానీ.. ప‌వ‌న్ రివ‌ర్స్ అయినా.. లేక వ్యూహం మార్చుకున్నా.. ఇవ‌న్నీ..ప‌క్క‌న పెట్టి, చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడినా.. ఈ జంపింగులు అంద‌రూ.. మూకుమ్మ‌డిగా సైకిల్ ఎక్కేస్తారు. అంటే.. చంద్ర‌బాబు స‌ర్కారుకు ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దన్న మాట‌. ప్ర‌స్తుతం ఈ వ్యూహంపై టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏంజ రుగుతుందో చూడాలి.