‘రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ సభలో బహిరంగంగానే పవన్ ప్రకటించారు. ఇపుడా ప్రకటనను కవర్ చేసుకోలేక జనసేన సీనియర్ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనవ్వను అని ఎవరైనా అంటే ఏమిటర్ధం ? పైగా అంతకుముందే వైసీపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో పొత్తుకు రెడీ అన్నట్లుగా ఒకమాట వదిలారు.
దాంతో అందరూ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే అని అనుకున్నారు. ఇప్పటికే పవన్ తో పొత్తుకు చంద్రబాబునాయుడు లవ్ ప్రపోజల్ పంపటం, తాజాగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పవన్ ప్రకటించటంతో అందరు టీడీపీతో పొత్తనే అనుకున్నారు. మరి జనాల్లో లేదా జనసైనికుల్లో ప్రత్యేకించి కమలం పార్టీ నేతల్లో దీని ప్రభావం నెగిటివ్ గా మొదలైనట్లు సమాచారం.
ఎందుకంటే టీడీపీని తమతో కలుపుకోవాలంటే ముందు ఒప్పుకోవాల్సింది బీజేపీ అగ్రనేతలు. అలాంటిది చంద్రబాబుతో పొత్తును పవన్ ఏకపక్షంగా ఓపెన్ ఆఫర్ ఇచ్చేసినట్లు బీజేపీ నేతల్లో చర్చలు మొదలైపోయిందట. దాంతో జరగబోయే నష్టం ఏమిటో జనసేన నేతలకు అర్ధమైనట్లుంది. అందుకనే ఇపుడు కవరింగ్ కు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనంటే అర్ధం టీడీపీతో పొత్తుకు రెడీ అని కాని లేదా ప్రతిపక్షాలన్నింటినీ కలుపుతానని కాదట. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా జనసేనకు మాత్రమే పడతాయని అర్ధమట.
2019లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా ఏకపక్షంగా వైసీపీకి ఎలా పడ్డాయో 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ జనసేనకు పడటం ఖాయమని పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అంటున్నారు. ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినా, ఏ ఛానల్లో మాట్లాడినా ఇలాగే వివరించి చెబుతున్నారు. అంటే పవన్ ప్రకటన తాలూకు ఎఫెక్ట్ బీజేపీపైన ఏ విధంగా పడింది తర్వాత దాని రియాక్షన్ జనసేనలో ఎలా కనబడిందో అర్ధమవుతోంది. చేసే ప్రకటనేదో స్పష్టంగా చేసుంటే ఇపుడీ గొడవ ఉండేది కాదు కదా.