రాజకీయాలొద్దు.. బ్రదర్ అనిల్ కు వార్నింగ్

వైసీపీ ప్రభుత్వంపై బ్రదర్ అనిల్ కుమార్ కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనపై క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సంతోషంగా లేరని, అందుకే ఆయా సంఘాల ప్రతినిధులతో తాను భేటీలు నిర్వహిస్తున్నానని బ్రదర్ అనిల్ చెబుతున్నారు. కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదంటూనే…ఏపీకి బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్రదర్ అనిల్ పై ఏపీ క్రిస్టియన్ జేఏసీ ఛైర్మన్ యలమంచిలి ప్రవీణ్  సంచలన వ్యాఖ్యలు చేశారు.

బ్రదర్ అనిల్ కు రాజకీయాలతో ఏం సంబంధం అని ప్రవీణ్ ప్రశ్నించారు. మత ప్రబోధకుడిగా ఉన్న బ్రదర్ అనిల్ రాజకీయ నాయకుడిగా ఎప్పుడు అవతారమెత్తారో చెప్పాలని ప్రవీణ్ ప్రశ్నించారు. బ్రదర్ అనిల్ కు రాజకీయాలపై ఆసక్తి ఉంటే…తెలంగాణలో రాజకీయ పార్టీ పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో తలదూర్చవద్దు బ్రదర్ అంటూ అనిల్ కు ప్రవీణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అగ్ర కులానికి చెందిన బ్రదర్ అనిల్ … బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ ప్రవీణ్ ఎద్దేవా చేశారు.

ఏపీలో కేఏ పాల్ తర్వాత…బ్రదర్ అనిల్ ను వైయస్ రాజశేఖరరెడ్డి ప్రపంచానికి శాంతిదూతగా పరిచయం చేశారని, అటువంటి అనిల్ రాజకీయాల్లో తల దూర్చవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. ప్రవీణ్ వ్యాఖ్యల నేపథ్యంలో బ్రదర్ అనిల్ రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ప్రవీణ్ వ్యాఖ్యల వెనుక వైసీపీ నేతలున్నారని, డైరెక్ట్ గా బ్రదర్ అనిల్ పై విమర్శలు చేయలేక ఇలా చేయించి ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. జగన్ పై బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలకున్న వ్యతిరేకతను బ్రదర్ అనిల్ వెల్లడిస్తున్నారన్న కారణంతోనే ఆయనపై క్రిస్టియన్ సంఘాల నాయకులతో విమర్శలు గుప్పించారని విమర్శిస్తున్నారు.