గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన సమస్యను మొదలుపెట్టిందే ప్రభుత్వం. ఏడాది పాటు ఆ సమస్యను సాగదీసి, సినీ ప్రముఖులను తమ వెంట తిప్పించుకుని, చివరికి చిరు లాంటి వాళ్లు చేతులు జోడించి వేడుకునేలా చేసిన ఘనత ప్రభుత్వ పెద్దలదే. ఐతే చిరు సహా కొందరు ప్రముఖులు పరిశ్రమ బాగు కోసమని ఎంత తగ్గాలో అంతా తగ్గారు. చివరికి నెల కిందట టికెట్ల రేట్ల పెంపుతో పాటు కొన్ని మినహాయింపులకు జగన్ అంగీకరించారు.
అంతటితో సమస్య తీరిపోయిందని అనుకుంటే.. రేట్ల పెంపు, ఐదో షో విషయంలో మెలికలు పెడుతూ జీవో ఇచ్చి ఇండస్ట్రీ జనాలను ఇరుకున పడేసింది. ఇప్పుడు ఏ సినిమాకు ఆ సినిమాకు విన్నపాలు పెట్టుకుంటే, ప్రభుత్వ పెద్దల్ని మెప్పించి ఒప్పిస్తే తప్ప స్పెషల్ రేట్లు, షోలు సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు.
ఏపీ సీఎంతో సమావేశానికి చిరుతో పాటు వెళ్లిన వాళ్లలో ప్రభాస్ కూడా ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ స్టార్‌గా ఉన్న అతను.. తన స్థాయి తగ్గించుకుని వెళ్లి సీఎంకు విజ్ఞప్తి చేశాడు. అతడి మిత్రులైన యువి క్రియేషన్స్ అధినేతలు సీఎంకు సన్నిహితులే అని చెబుతారు.
అయినా సరే.. రాధేశ్యామ్‌కు టికెట్ల రేట్ల పెంపునకు ఛాన్స్ లేకపోయింది. ఐదో షో కూడా పడలేదు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌కు మాత్రం టికెట్ రేటు మీద వంద పెంచుకునే అవకాశం ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే అదనపు షోలకు కూడా ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఇదంతా రాజమౌళి మరోసారి వ్యక్తిగతంగా వెళ్లి సీఎంను కలిసిన ఫలితమే అంటున్నారు.
ఇదే నిజమైతే కచ్చితంగా ఇది పక్షపాతమే అవుతుంది. ఇలా తమ దగ్గరికి వచ్చి కలిసి విన్నవించుకున్న వారికే రేట్ల పెంచుకునే అవకాశం కల్పించడం, మిగతా వాళ్లకు ఇంకోలా వ్యవహరించడం ఏంటో అర్థం కాని విషయం. చూస్తుంటే సినిమా వాళ్ల విషయంలో జగన్ ఇగో ఇంకా చల్లారలేదా? ఇండస్ట్రీ అంత తనకు మోకరిల్లాలని కోరుకుంటున్నారా.. ఇలా ఒక్కొక్కరు తన దగ్గరికొచ్చి ప్రాధేయపడితే తప్ప ఆయన మినహాయింపులు ఇవ్వరా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయిప్పుడు.