మార్చి 27..మంత్రులకు జగన్ డెడ్ లైన్?

ఏపీ మంత్రివర్గ విస్తరణపై చాలాకాలంగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ముందుగా అనుకున్నట్లుగానే రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ స్వయంగా ప్రకటించడంతో ఈ విషయంపై వైసీపీ నేతలకు క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా నేడు జరిగిన వైసీఎల్పీ సమావేశంలో జగన్ మంత్రి వర్గ విస్తరణ అంశంపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఎమ్మెల్యేలకు జగన్ షాకింగ్ విషయాలు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఉగాది రోజు ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు జగన్ ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని జగన్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా మార్చి 27న మంత్రులంతా రాజీనామా చేయాల్సి ఉంటుందని జగన్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారట. అయితే, ఐదుగురు మంత్రులు మినహా మిగతావారందరిపై వేటు తప్పదని ప్రచారం జరుగుతోంది. ఆ ఐదుగురికి మాత్రం జగన్ మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట.

పనితీరు, సామాజిక సమీకరణాలు, ప్రతిపక్షాలకు ధీటైనా సమాధానం చెప్పగలగడం, వంటి లెక్కలన్నీ బేరీజు వేసుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని లను కచ్చితంగా కొనసాగించాలని జగన్ అనుకుంటున్నారట. ఇక, మంత్రి బుగ్గన, బాలినేనిలను కూడా కొనసాగించే అవకాశముందట. బొత్సకు పార్టీ రీజినల్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. విజయవాడలో పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలు మొత్తం విజయసాయికి అప్పగించనున్నారట.

హోమ్ మంత్రి పదవి మరోసారి మహిళకే కేటాయించాలని జగన్ అనుకుంటున్నారట. ఇక, తొలి విడత మాదిరిగానే ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారట. 50 శాతం మంత్రి పదవులు బీసీ లకు, 33 శాతం మంత్రి పదవులు మహిళలకు ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారట. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా పనితీరును బట్టి మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి మంత్రి పదవులు కేటాయించబోతున్నారని తెలుస్తోంది.