ఇంకా అధికార బాధ్యతలు తీసుకోకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ వార్నింగిచ్చారు. వార్నింగ్ అంటే ఎవరికో కాదులేండి తమ పార్టీ తరపున పంజాబ్ లో గెలిచిన ఎంఎల్ఏలు, నేతలకే. తమ పార్టీకి ఘన విజయం అందించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం అమృతసర్ లో భారీ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ చాలా ఏళ్ళ తర్వాత పంజాబ్ కు భగవంత్ మాన్ రూపంలో నిజాయితీపరుడైన సీఎం రాబోతున్నట్లు చెప్పారు. ఇదే సందర్భంలో ఎంఎల్ఏలు, నేతల్లో ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని కచ్చితంగా జైలుకు పంపిస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అవినీతిని ఆప్ ఎంతమాత్రం సహించదని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ క్లీన్ ఇమేజిని చూసిన తర్వాతే జనాలు ఆప్ కు పంజాబ్ లో అఖండ మెజారిటిని అందించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ పైన కానీ ఆప్ ప్రభుత్వంపైన కానీ ఇప్పటివరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు.
అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ఢిల్లీలో కేజ్రీవాల్ కు పెద్దగా అవకాశాలు లేవు కాబట్టే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. విద్య, వైద్యం, జనాలందరికీ నిత్యావసరమైన మంచినీటి సౌకర్యంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే రవాణా సౌకర్యాలను కూడా జనాలకు అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీలో పెద్ద సమస్యగా మారిన వాతావరణ కాలుష్య నియంత్రణకు బాగా కష్టపడుతున్నారు. వీటన్నింటి విషయంలో జనాలు కూడా సానుకూలంగానే ఉన్నారు.
ఈ పాలన చూసే పంజాబ్ లో జనాలు ఆప్ కు మంచి మెజారిటీ అందించారు. ఇందుకనే కేజ్రీవాల్ ఎంఎల్ఏలు, నేతలకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే పంజాబ్ వ్యవసాయక రాష్ట్రమే కాదు పారిశ్రామికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అనేక ప్రధాన సమస్యల్లో డ్రగ్ మాఫియా, పెరిగిపోతున్న నిరుద్యోగం కీలకమైంది. అందుకనే వీటి పరిష్కారంపై తమ ప్రభుత్వం తక్షణమే దృష్టిపెడుతుందని కేజ్రీవాల్ తో పాటు భగవంత్ మాన్ కూడా ప్రకటించారు. ప్రకటించారు సరే పరిపాలనలో ఎంతవరకు అమలు చేస్తారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates