ఏపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చూస్తున్నారు. వైసీపీలో అసంతృప్త నేతగా ఉన్న ఆయన.. ఇప్పుడు పొలిటికల్ ఫ్యూచర్‌పై దృష్టి సారించారు. అందుకే మరో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అయితే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కాస్త బలంగా ఉన్నాయి. కానీ డీఎల్ మాత్రం ఇవి రెండు కాకుండా బీజేపీలో చేరాలని అనుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆ పదవి ఆశిస్తే..
డీఎల్ జగన్ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు జగన్‌కు కలిసిన ఆయన ఆ పార్టీ కండువా మాత్రం కప్పుకోలేదని అంటున్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో పదవి వస్తుందని ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. ఆయన ఎమ్మెల్సీ పదవిని కోరుకున్నారు కానీ జగన్ మొండిచెయ్యి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లాలో ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్, బద్వేలుకు చెందిన డీసీ గోవిందరెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. దీంతో డీఎల్ ఆశలు గల్లంతయ్యాయి.
అందుకే బీజేపీ..
జగన్ తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో డీఎల్ ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. మొదట టీడీపీలోకి వెళ్లాలని అనుకున్నట్లు సమాచారం. కానీ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టికెట్ తనకు ఇస్తేనే ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కండిషన్ పెట్టారని తెలిసింది. కానీ టీడీపీ నుంచి అక్కడ పుట్టా సుధాకర్ ఉండడంతో చంద్రబాబు డీఎల్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదని టాక్.
దీంతో ఇప్పుడు ఆయన బీజేపీవైపు మొగ్గుచూపినట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ జోరు చూసి ఆయన బీజేపీకి జై అంటున్నారు. పైగా జనసేనతో పొత్తుతో మైదుకూరులో పోటీ చేసి గెలవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఈ నెల 19న కడపలో బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates