రాష్ట్రపతి రేసులో తెలుగోడు !!

మరో నాలుగు నెలల్లో ఖాళీ కానున్న రాష్ట్రపతి పదవిపై దేశంలోని అనేక మంది సీనియర్ నేతలు, రాజనీతిజ్ఞులు ఆశపడుతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం 2022 జులైతో పూర్తి కానుంది. రెండోసారి ఆయనకు రాష్ట్రపతి పదవి వరించ అవకాశం ఉండకపోవచ్చు. బాబూ రాజేంద్ర ప్రసాద్ మినహా ఇప్పటి వరకు ఎవరూ రెండు సార్లు రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. ప్రస్తుత రాష్ట్రపతికీ అలాంటి అవకాశం లేకపోవచ్చన్నదే అంతటా వినిపిస్తున్న మాట.

అలాంటప్పుడు కోవింద్ స్థానంలో వచ్చేది ఎవరనే చర్చ దిల్లీలో మొదలైంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి పదవి దక్కొచ్చన్న వాదన ఒకటి ఉన్నప్పటికీ అది బలంగా వినిపించడం లేదు. వెంకయ్యనాయుడికి అవకాశం దక్కకపోయినా దక్షిణాదికి చెందిన నేత ఈసారి రాష్ట్రపతి కావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అబ్దుల్ కలామ్ తరువాత దక్షిణ భారతీయులు ఎవరికీ ఈ పదవి దక్కలేదు.

పైగా దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ రాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా సౌత్ ఇండియా ప్రజలను ఊరడించే ఆలోచనలోనూ ఉంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తెలంగాణపై గురిపెట్టిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఈసారి రాష్ట్రపతి ఎన్నిక కావొచ్చన్న అంచనాలు భారీగా వినిపిస్తున్నాయి. తెలంగాణకు చెందిన వెనుకబడిన వర్గాల నేత ఒకరు రాష్ట్రపతి రేసులో ముందున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం హర్యానా గవర్నర్‌గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయ పేరు పరిశీలనకురానున్నట్లు ఢిల్లీ అధి కార లాబీల్లో వినవస్తోంది. దత్తాత్రేయకు అవకాశం కల్పిం చడం ద్వారా వివాద రహితుడికి అత్యున్నత పదవిని ఇచ్చిన ట్లవుతుందన్న విశ్లేషణతోపాటు, దక్షిణాది సీనియర్‌ నేతకు సముచిత గౌరవం కల్పించినన్నట్లవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు దత్తాత్రేయ సామాజిక వర్గం కర్ణాటక, ఏపీలోని రాయలసీమలోనూ ఎక్కువగా ఉన్నందున ఆయన పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో అక్కడ కురుమలను ఆకర్షించేందుకు కూడా దత్తాత్రేయ అయితే కరెక్టన్న భావన వినిపిస్తోంది. దత్తాత్రేయ అభ్యర్థిత్వంపై బీజేపీలోనూ ఎవరి నుంచీ అభ్యంతరాలు ఉండకపోవచ్చని.. అటు తెలంగాణలోనూ పార్టీలకు అతీతంగా ఆయనకు ఆమోదం దొరుకుతుందని భావిస్తున్నారు.

దత్తాత్రేయ ఆది నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌, జన్ సంఘ్‌, అనంతరం బీజేపీతోనే సాగుతున్నారు. నిరాడంబరుడు, వివాదరహితుడిగా పేరుంది. మోదీ మొదటి మంత్రివర్గంలో కొన్నాళ్లపాటు కార్మిక శాఖ చూసిన దత్తాత్రేయను ఆ తరువాత పదవి నుంచి తప్పించడంతో ఆయన్ను పక్కనపెట్టినట్లుగా భావించారు. కానీ, ఆ తరువాత దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా పంపించారు. అనంతరం కీలకమైన హర్యాణా గవర్నరుగానూ నియమించారు. దీంతో దత్తాత్రేయ ప్రాధాన్యం తగ్గలేదని, మోదీకి ఆయనపై మంచి అభిప్రాయమే ఉందని నిరూపణైంది. దీంతో రాష్ట్రపతి పదవికి ఆయన పేరుపై అభ్యంతరం ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. దేశ అత్యున్నత పదవిని కనుక దత్తాత్రేయ అధిరోహిస్తే ఆ పదవి అందుకున్న మూడో తెలుగువాడిగా, నీలం సంజీవరెడ్డి తరువాత సుదీర్ఘకాలానికి మళ్లీ రాష్ట్రపతి అయినవారిగా దత్తాత్రేయ చరిత్రకెక్కనున్నారు.