కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురొడ్డి ఢిల్లీలో వరుస విజయాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్‌లో పంజా విసిరింది. అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్‌కు షాకిస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2017 ఎన్నికల్లో కేవలం 20 సీట్లకే పరిమితమైన ఆప్.. ఈ సారి మాత్రం 92 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించే తొలిసారి అధికారంలోకి వచ్చిన ఆప్.. పంజాబ్‌లోనూ ఆ పార్టీని తన చీపురు గుర్తుతో ఊడ్చేసింది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారింది. దేశంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఆప్ అని మాటలు వినిపిస్తున్నాయి.
ఆ మోడల్‌తో..
పంజాబ్‌లో ఆప్‌కు ఇంతటి ఘన విజయం ఎలా సాధ్యమైందని దేశ రాజకీయాల్లో చర్చకు తెరలేసింది. పక్కనే ఉన్న ఢిల్లీ మోడల్‌ను చూపి కేజ్రీవాల్ పంజాబ్‌లో పాగా వేశారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ రాజధానిలో తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను పంజాబ్‌లో విస్త్రతంగా ప్రచారం చేశారు.
అక్కడ తమ ప్రభుత్వ విధానాలను పంజాబ్ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. దీంతో పంజాబీల్లోనూ అభివృద్ధి ఆశలు రేకెత్తించారు. మరోవైపు రైతు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేసిన ఉద్యమానికి ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యమంలో ఎక్కువ భాగం పంజాబ్ రైతులే ఉన్నారు. ఈ ఎన్నికల్లో వాళ్లు ఆప్‌కు మద్దతుగా నిలిచారు.
తప్పు దిద్దుకుని..
నిజానికి 2017లోనే పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తుందనే అంచనాలు వినిపించాయి. కానీ అప్పటి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవే తనకు చివరి ఎన్నికలని ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించడంతో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. పైగా అప్పుడు సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఆప్ బరిలో దిగింది. ఆ పార్టీ పంజాబ్‌లో గెలిస్తే కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి వస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో ఆ పార్టీకి దెబ్బపడింది. కానీ ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుని సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను ప్రకటించి పక్కా ప్రణాళికతో సాగింది. సిక్కు మతానికి చెందిన భగవంత్ సీఎం అనడంతో సర్దార్జీల్లో ఆప్‌పై నమ్మకం కలిగింది. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలూ ఆప్‌కు కలిసొచ్చాయి.