తన జోకులతో.. నటనతో.. ప్రజలను నవ్వించిన హాస్యనటుడు ఇప్పుడు పంజాబ్ సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. కమెడియన్‌గా ప్రజల మనసు దోచుకున్న ఆయన.. ఇప్పుడు ఓట్లు కూడా కొల్లగొట్టి తొలిసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయనే ఆమ్ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీని పాలించేది ఆయనే. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ రాజకీయాల్లో అడుగుపెట్టిన 11 ఏళ్లకే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం విశేషం. భారత రాజకీయాల్లో ఇది చాలా అరుదనే చెప్పాలి.
ఉపాధ్యాయ కుటుంబం నుంచి..
48 ఏళ్ల భగవంత్ 1973లో సంగ్రూర్‌లోని సతోజ్ గ్రామంలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. కళాశాల దశలోనే సామాజిక, రాజకీయ అంశాలపై వ్యంగాస్త్రాలు సంధించి మంచి హాస్య కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టీవీ సీరియళ్లతోనూ పంజాబ్ ప్రజలకు చేరువయ్యారు. ప్రస్తుత కాంగ్రెస్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్ధూ ఒకప్పుడు జడ్జ్‌గా వ్యవహరించిన ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షోలో భగవంత్ పాల్గొనడంతో ఆయన పేరు మార్మోగింది. 2011లో ఆయన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌లో చేరారు. ఆ పార్టీ తరపున 2012లో పోటీ చేసి ఓడిపోయారు.
ఈ నిర్ణయంతో..
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు పీపుల్స్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని భగవంత్ తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. సంగ్రూర్ నుంచి లోక్‌సభ ఎన్నికలో పోటీ చేసిన ఆయన రెండు లక్షలకుపైగా ఓట్లతో గెలిచారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఓటమి ఎదురైంది.
అయితే అప్పుడు 20 సీట్లు గెలిచిన ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా నిలవడంతో పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష బాధ్యతలను భగవంత్‌కే కేజ్రీవాల్ అప్పగించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి భగవంత్ గెలిచారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్ సీఎం అభ్యర్థి ఎవరూ అంటూ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 93 శాతం మంది భగవంత్‌కే మొగ్గు చూపారు. దీంతో సీఎం అభ్యర్థిగా ఆయన్నే కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పుడు ఆ పార్టీ నెగ్గడంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates