ఎప్పటి నుంచో ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మంచి ప్రేమ పెంచుకుంటున్న పవన్ కల్యాణ్ కు ఇప్పుడొక మంచి ఛాయిస్ దొరికింది.ఇది కూడా వినియోగించుకోలేకపోతే ఏం చేయలేం. ఆయన ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పరితపిస్తూ ఉన్నారు. 2 ఎన్నికలు ఆయన వృథా చేశారు.అంటే విలువయిన పదేళ్ల కాలాన్నీ తనకు కాకుండా చేసుకున్నారనే చెప్పాలి. అయినా కూడా ఆయన బాధపడిన దాఖలాలు లేవు.
మొదటి ఎన్నికల్లో అవశేషాంధ్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని కలలు కన్నారు. అందుకే ఆయన ఆ రోజు టీడీపీకి బాసటగా నిలిచారు. ఆ తరువాత పరిణామాల్లో భాగంగా ఆయన కమ్యూనిస్టులతో కలిసి పనిచేసినా కూడా 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ఢీ కొనలేకపోయారు.దీంతో ఆయన ఆశించిన ఫలితాలు అస్సలు సాధించలేకపోయారు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయి.ఎలానూ జేడీ లక్ష్మీనారాయణ లాంటి ఉన్నతాధికారులతో కేజ్రీకి స్నేహం ఉంది కనుక వచ్చేసారి మంచి రాజకీయం చేయాలంటే, మేలిమి స్థాయి ఫలితం అందుకోవాలంటే తప్పక ఆయన కేజ్రీతో చేతులు కలపాల్సిందే! ఎందుకంటే రాష్ట్రంలో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పవన్ కు అంతగా ఏమీ కలిసి రాదు. పోనీ టీడీపీతో వెళ్లినా ఆ లాభం అటు వైసీపీ కానీ లేదా టీడీపీ కానీ తీసుకుంటాయి. కానీ పవన్ మాత్రం ఎప్పటిలానే ఒంటరి అయిపోతారు. కనుక ఈ దశలో ఆయనకున్న ఏకైక ఛాయిస్ కేజ్రీ మాత్రమే ! బాగా చదువుకున్న వారు జనసేనలోనూ ఉన్నారు.
వారితో కలిసి సమాలోచనలు జరిపి వచ్చే ఎన్నికల్లో ఆప్ తో కలిసి వ్యూహం రచిస్తే జనసేన బతకడం ఖాయం.వైసీపీకి చుక్కలు చూపించడం కూడా ఖాయం అని కొందరు పవన్ అభిమానులు అంటున్నారు.గత రెండు ఎన్నికల్లో తాము మోసపోయామని ఫలితంగా ఇవాళ అవమానాలు ఎదుర్కొంటున్నామని జనసేన అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయంతో పవన్ రాజకీయ చదరంగంలో గెలిచి నిలవాలి అన్నది ఆయన అభిమానుల సుస్థిర ఆకాంక్ష.
Gulte Telugu Telugu Political and Movie News Updates