సీఎం జగన్‌పై ఆర్యవైశ్య నేతలు బాబు, సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు అసెంబ్లీలో సంతాపం ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డికు మాత్రమే సంతాపం తెలిపారన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే రోశయ్యకు సంతాపం తెలపలేదని ఆరోపించారు. సీఎంగా , గవర్నర్‌గా సీనియర్ నేత రోశయ్య పని చేశారని, రోశయ్య మృతి చెందినప్పుడు కూడా జగన్ కనీసం నివాళులు అర్పించలేదని చెప్పారు.
ఆర్యవైశ్యులు అంటే జగన్‌కి చులకన భావమని మండిపడ్డారు. ఆర్యవైశ్యులపై జగన్ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని, రాబోవు రోజుల్లో ఆర్యవైశ్యులు గట్టిగా బుద్ధి చెబుతారని బాబు, సత్యనారాయణ హెచ్చరించారు. రోశయ్య చేసిన తప్పేంటని వారు ప్రశ్నించారు. వైఎస్ గతంలో ఎంతో ప్రేమగా `అన్న` అని పిలుచుకున్న రోశయ్యను కనీసం పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
రోశయ్య ను పట్టించుకోకపోవడంతో వైఎస్ ఆత్మ కూడా జగన్ చేసిన పనికి క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపి.. జగన్‌కు బుద్ది చెబుతామని హెచ్చరించారు. మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఏపీ అసెంబ్లీలో సంతాపం తెలియజేయకపోవడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘‘ఇదేందయ్యా జగనూ…. మాజీ సీఎం, మాజీ గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య గారికి కనీసం సభలో సంతాపం కూడా చెప్పడానికి మనసు రాలేదా?. నీ తండ్రి కి అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన రోశయ్య గారు చనిపోతే నాడు నివాళికీ నువ్వు వెళ్లలేదు. నేడు కనీసం సభలో గౌరవంగా సంతాపం కూడా తెలుపలేదు. నాడు నీ నైజాన్ని, నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలిపింది రోశయ్య గారు అనే నీకు ఇంత కక్ష అనేది బయట టాక్. నీ స్నేహితుడు అయిన గౌతమ్ రెడ్డికి సంతాపం తెలిపిన నువ్వు… మీ తండ్రి అన్నలా భావించిన రోశయ్యకు మాత్రం సంతాపం తెలుపలేదు’’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.