జగన్ సర్కార్ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న అసెంబ్లీలో సైతం గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలని, ఏపీలో అభివృద్ధే లేదని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ తీరుకు నిరసనగా టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా గవర్నర్ హరిచందన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ హరిచందన్ తో పాటు మొత్తం గవర్నర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. సీఎం జగన్ కు హెడ్ క్లర్క్‌గా గవర్నర్ హరిచందన్ మారిపోయారంటూ నారాయణ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏపీ గవర్నర్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారంటూ నారాయణ చేసిన పోలిక రాజకీయ దుమారం రేపుతోంది. హరిచందన్ లాంటి వారి వల్ల మొత్తం గవర్నర్ల వ్యవస్థపైనే నమ్మకం పోతోందనినారాయణ చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.
తమకు అనుకూలంగా ఉండే వారిని ఆయా రాష్ట్రాలతో ఉన్న సంబంధాలను బట్టి గవర్నర్లుగా కేంద్రం నియమిస్తుంటుంది. వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ తో ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ మోస్ట్ నేత హరిచందన్ ను ఏపీ గవర్నర్‌గా నియమించింది కేంద్రం. జగన్ కు కేంద్రంతో సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో హరిచందన్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
కేసీఆర్ తో మోదీకి ఉన్న విభేదాల కారణంగా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ అన్న రీతిలో వార్ నడుస్తుంటే…ఏపీలో మాత్రం సీన్ వేరేలా ఉందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఏది చెబితే గవర్నర్ అది చేస్తున్నారని, రబ్బర్ స్టాంప్‌గా మారిపోయారని, తన పేరు మీద అప్పులు తెచ్చినా సైలెంట్ గా ఉండడమే అందుకు నిదర్శనమని అంటున్నారు. టీడీపీ ఆరోపణలకు తోడు తాజాగా హరిచందన్ పై సీపీఐ నారాయణ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేేయడం చర్చనీయాంశమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates