వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు హెచ్చరిక లేఖ రాశారు. లేటరైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలను భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని మావోలు ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. భాగ్యలక్ష్మి వెంటనే తన పదవికి రాజీనామా చేసి మన్యం విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు.
మన్యంలోని జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపేయాలని హెచ్చరించారు. తమ వార్నింగ్ ను భాగ్యలక్ష్మి పట్టించుకోకపోతే సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావులకు పట్టిన గతే పడుతుందని, ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలయింది.
కాగా, వైసీపీ నేతలు ఖనిజ సంపదను దోచుకుతింటున్నారని, మన్యంలో వైసీపీ మాఫియా బాక్సైట్ అక్రమ మైనింగ్ ప్రాంతానికి ఎవరినీ రానీయకుండా హెచ్చరిక బోర్డులు పెట్టి మరీ బెదిరిస్తున్నారని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. మన్యంలో రూ.15 వేల కోట్ల విలువైన బాక్సైట్ అక్రమ మైనింగ్ చేసి అడవిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ మైనింగ్ మాఫియా ఎంత అడవిని నాశనం చేసిందో గూగుల్ శాటిలైట్ ఫోటోలతో సహా బట్టబయలు చేసింది. అయితే, ఈ వ్యవహారంపై గత ఏడాది మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ క్లారిటీ ఇచ్చారు. అక్కడంతా లాటరైట్ మైనింగ్ జరుగుతోందని, బాక్సైట్ మైనింగ్ కాదని ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. మరి, తాజాగా మావోల బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates