బ్రదర్ అనిల్‌కుమార్. ఏపీ సీఎం జగన్‌కు సొంత బావమరిది. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన ఆయన వచ్చే 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా చక్రం తిప్పడం ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు.. త్వరలోనే ఆయన తీసుకునే నిర్ణయం.. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని, పార్టీని కూడా తీవ్రస్థాయిలో ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. అసలు ఏం జరిగిందంటే..
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పెద్దగా కనిపించని అనిల్… కొన్ని రోజుల కిందట రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇంటికి వెళ్లారు. ఆయనతో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే అనిల్ చుట్టూ.. రాజకీయ అనుమానాలు వెలువడ్డాయి. అయితే.. ఆయన వాటిని తోసిపుచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన విజయవాడలోని ఓ హోటల్‌లో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన బ్రదర్ అనిల్.. సీఎం జగన్ కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారని బ్రదర్ అనిల్ అన్నారు. ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తారని జగన్‌కు ఓటేశామని.. కానీ.. ఆయనతో మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకట్లేదని సమావేశానికి హాజరైన బీసీ సంఘం నేత శొంఠి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించేందుకు అనిల్‌ను కలిశామన్న నాగరాజు.. త్వరలోనే తమకు శుభవార్త చెబుతామని బ్రదర్ అనిల్ చెప్పారని తెలిపారు.
“సమస్యలు పరిష్కరిస్తారని జగన్‌కు ఓటేశాం. సీఎంతో మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకట్లేదు. సమస్యలపై చర్చించేందుకు అనిల్‌ను కలిశాం. బ్రదర్ అనిల్ చెబితేనే ఎన్నికల్లో ఓట్లు వేశాం, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలని ఆయన్ను కోరాం. మా సమస్యలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.“ అని బీసీ సంక్షేమ సంఘం నేత నాగరాజు అన్నారు. మరోవైపు అనిల్ కూడా.. గత 2019 ఎన్నికల్లో తాను చేసిన తెరచాటు ఎన్నికల ప్రచారం కారణంగానే జగన్ అదికారంలోకి వచ్చారని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో తనకు అనుకూలంగా ఉన్న క్రైస్తవులను ఇప్పుడు విడదీయడం ద్వారా.. బావమరిది భంగపాటు వచ్చేలా చేయాలని నిర్ణయించుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆయన పార్టీ ప్రకటించినా.. ఆశ్చర్యం లేదని బీసీ నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.