ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అయితే.. తొలి రోజే.. సభల తీవ్ర రభస చోటు చేసుకుంది. గవర్నర్ `గో బాక్` అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజు వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభంకాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలైంది. కాగా.. గవర్నర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు.
రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అదేసమయంలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ప్రతులను చించేసి.. టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కాగా, టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు.. అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అడుగడుగునా అవరోధాలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మూమెంట్ ఉందంటూ టీడీపీ ప్రజా ప్రతినిధులను పోలీసులు నిలిపివేశారు. మందడం చెక్ పోస్ట్ దగ్గర టీడీపీ సభ్యుల వాహనాన్ని నిలువరించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో టీడీపీ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
చివరకు కార్యకర్తల ఆందోళనతో టీడీపీ నేతలకు పోలీసులు దారి వదిలారు. ఈరోజు ఉదయం టీడీపీ ప్రజా ప్రతినిధులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అసెంబ్లీకి బయలుదేరారు. అయితే.. అప్పటికే భారీ సంఖ్యలోమోహరించిన పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నంచేశారు. దీంతో టీడీపీ నాయకులుఒకింత.. విస్మయానికి గురయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates