గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచినప్పటి నుంచి రఘురామ కృష్ణం రాజు సొంత పార్టీకే పక్కలో బళ్లెంలా మారారు. రెబల్ ఎంపీగా మారి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. వివిధ చర్యలతో జగన్‌ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ చేసిన ఫిర్యాదు ఇంకా పెండింగ్‌లో ఉంది. త్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటే రఘురామపై సస్పెన్షన్ వేటు పడుతుందనే ప్రచారం సాగుతోంది. అందుకే అంతకంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచి చూపిస్తానని రఘురామ ఇప్పటికే ప్రకటించారు.
నరసాపురం నుంచి గెలిచిన ఆయన ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించారు. అప్పటిలోపు తనపై అనర్హత వేటు వేయించాలని కూడా సవాలు విసిరారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే టాక్ బలంగా వినిపించింది. ఆ పార్టీ నుంచే ఆయన ఉప ఎన్నికలో పోటీ చేస్తారని తెలిసింది.
అందుకోసం ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ పెద్దలను చాలా సార్లు ఆయన కలిశారు. కానీ ఇప్పటివరకూ రఘురామ రాజీనామా చేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన బీజేపీలో చేరేందుకు ఇంకా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో కేసీఆర్ ఉండడంతో ఆ పార్టీ అగ్రనేతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
కేవలం రఘురామ ఒక్కడి కోసం వైసీపీని ఎందుకు దూరం చేసుకోవడం అని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకు ఆయన్ని పార్టీలో చేర్చుకునే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదని అంటున్నారు. పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన రాజీనామా చేస్తారని అనుకున్నారు. కానీ బీజేపీ నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతోనే ఆయన వెయిట్ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది. రెండో విడత సమావేశాలు ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. అవి ముగిసిన తర్వాత ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. అప్పటి వరకూ బీజేపీ నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోతే ఆయన జనసేనలో చేరే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. జనసేనలో చేరయినా ఉప ఎన్నికలో పోటీ చేస్తానని రాజీనామా చేయడం మాత్రం ఖాయమని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates