తెలంగాణ రాజకీయాలు గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్గా మారాయి. కేంద్రంలోని బీజేపీపై పోరు బావుటా ఎగరేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ తమిళి సైతో దూరం పెంచుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం ఉండదని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సమావేశాలకు ఇవి కొనసాగింపు కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని పెట్టడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత సమావేశాలకు కొనసాగింపు అనే పేరుతో తనను పక్కనపెట్టడంపై ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. సంప్రదాయాన్ని పాటించరా? అంటూ మండిపడ్డారు. దీంతో ప్రగతి భవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య దూరం మరింత పెరిగినట్లే కనిపిస్తోంది.
అలా మొదలైంది..
తెలంగాణ గవర్నర్‌గా వచ్చిన తమిళి సైతో ఆరంభంలో కేసీఆర్ సన్నిహితంగానే మెలిగారు. ప్రభుత్వంతో ఎలాంటి విభేదాలు అప్పుడు లేవు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ప్రతిపాదనతో ఈ గొడవ మొదలైందని విశ్లేషకులు అంటున్నారు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలపలేరు. ఆయనపై కేసులున్నాయని దాన్ని పెండింగ్‌లో పెట్టారు. దానిపై కేసీఆర్‌తో చర్చలు జరిగినా ఆమె వెనక్కి తగ్గలేదని తెలిసింది. దీంతో కౌశిక్‌ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి.. మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేశారు.
మరో స్థాయికి..
శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారని అంటున్నారు. చివరకు ప్రభుత్వం అదనపు సమాచారం ఇచ్చిన తర్వాత ప్రొటెం ఛైర్మన్‌గా జాఫ్రీని ఆమె ఆమోదించారు. ఇక ఆ తర్వాత తెలంగాణలో బలోపేతం అయ్యే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు ఆ పార్టీపై కేసీఆర్ పోరాటం మొదలెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నాయకులకు కలుస్తున్నారు. దీంతో కేసీఆర్, గవర్నర్‌కు మధ్య దూరం మరో స్థాయికి చేరింది.
జనవరి 26న గవర్నర్ ప్రసంగం విషయంలోనూ అంతరాలు వచ్చాయి. ఆ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమానికి కేసీఆర్ సహా మంత్రులెవరూ హాజరు కాలేరు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని దానిపై గవర్నర్ సీరియస్ అయ్యారు. మేడారం జాతర ముగింపు కార్యక్రమానికి తాను వెళ్తే అధికారులు, మంత్రులు లేకపోవడంపై ఆమె చర్యలకు దిగారు. ఇక ఇప్పుడు ఏకంగా బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కేసీఆర్ వర్సెస్ గవర్నర్ పోరు ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.