ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో ఘన విజయంతో వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది. జగన్ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జగన్ హవా సాగడంతో 2019 ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 151 సీట్లు దక్కాయి. జగన్ పేరుతో ఫ్యాను గాలి వీచడంతో అభ్యర్థులు విజయాలు సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టి ఇటీవల 1000 రోజులు పూర్తయ్యాయి. ఈ రెండున్నరేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ సాగింది. ఇక మరో రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో పార్టీని మళ్లీ గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. కానీ మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని మాత్రం ఆయన పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందరూ కాదు..
గత ఎన్నికల్లో జగన్ జోరుతో వైపీపీ అఖండ విజయం సాధించొచ్చు. జగన్ బొమ్మతో ఎమ్మెల్యేలు గెలిచి ఉండొచ్చు. కానీ అందులో ఇరవై నుంచి నలభై శాతం మంది ఎమ్మెల్యేలు తమ సొంత సత్తాతో గెలిచారనడంలో సందేహం లేదు.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఏకపక్ష నిర్ణయాలు.. చర్యల ద్వారా ఇప్పుడు దాదాపు పార్టీలోని 40 మంది ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదని.. అందుకు నిధులు లేవని కొంతమంది నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
విలువ లేదని..
జగన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు తమకు సీఎం విలువ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని కానీ ఇలా ఎవరూ వ్యవహరించలేదని చెబుతున్నారు. ఏ సీఎం అయినా ఎమ్మెల్యేల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని నిర్ణయాలు ప్రకటించేవాళ్లని.. కానీ జగన్ మాత్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టులు.. జిల్లాల విభజన ఇలా అన్నీ ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే చేశారని తెలిసింది. తమ విజయం కోసం కష్టపడిన వాళ్లకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలని ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. కానీ కులాలు, మతాల పేరుతో జగన్ తాను అనుకున్న వాళ్లకే పదవులు కట్టబెట్టారని ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు.
పార్టీ మారేందుకు..
ఇలా జగన్‌పై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలకు ముందు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందని ఓ ఎమ్మెల్యే ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. మర్కాపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడం, కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడంపై నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఆనం కూడా జిల్లాల పునర్విభజన విషయంలో జగన్‌పై సీరియస్ అయ్యారు. మరి ఎన్నికల సమయం నాటికి వీళ్ల అసంతృప్తిని జగన్ తగ్గిస్తారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates