అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ ప్రభుత్వం మొండిపట్టు పట్టి అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో ఈ తీర్పు రావడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న తరహాలో తాము పరిపాలిస్తున్న రాష్ట్రానికి మూడు రాజధానులు అంటున్నారు వైసీపీ నేతలు.
ఈ క్రమంలోనే ఆ తీర్పును కొందరు వైసీపీ నేతలు తప్పుబడుతూ సుప్రీం కోర్టుకు వెళతామని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, మరికొందరు వైసీపీ నేతలైతే..అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూ…తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిపై మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అది అమరావతి కాదని, కమ్మరావతని అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
3 రాజధానులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ప్రతి విషయంపై చంద్రబాబు కోర్టుకెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అప్పలరాజు విమర్శించారు. తాము అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మూడు రాజధానులపై జగన్ ముందుకెళతారని ధీమా వ్యక్తం చేశారు.
అమరావతిలో భూములు కొన్నవారు, అమ్మినవారు అందరూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారని వైసీపీ నేతలు గతంలోనూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక, అమరావతే రాజధాని అంటూ తమ సామాజిక వర్గానికి చెందిన వారికి చంద్రబాబు లీకులిచ్చి అందరికంటే ముందుగా భూములు కొనేలా వ్యవహరించారని సీఎం జగన్ కూడా గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates