వైసీపీ నుంచి ప్రీతి అదానికి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం దక్కబోతోందా ? మీడియా వార్తల ప్రకారం అవుననే అనుకోవాలి. జూన్ లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే అనీ వైసీపీకే దక్కుతాయి. ఈ నాలుగింటికి జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ చాలా జోరుగా జరుగుతోంది. నాలుగింటిలో ఒక సీటును విజయసాయిరెడ్డి కి రెన్యువల్ చేస్తారని అందరు అనుకుంటున్నారు.
ఎందుకంటే జూన్లో ఖాళీ అవబోయే నాలుగు సీట్లలో విజయసాయిరెడ్డి ది కూడా ఒకటి. కాబట్టి విజయసాయికి రెన్యువల్ ఖాయం. అంటే ఇక మిగిలిన మూడు స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారనేది సస్పెన్సుగా మారింది. ఈ మూడింటిలో అదానీ కుటుంబానికి ఒకటి ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దాని ఆధారంగానే తాజాగా గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానికి ఒక స్థానాన్ని జగన్ హామీ ఇచ్చారట. అదానీతో మోడీకున్న సాన్నిహిత్యం వల్ల మోడీ దృష్టిలో పడటానికి జగన్ అవసరాన్ని పరిగణలోకి తీసుకుంటే అందుకు అవకాశం ఉందనే అనిపిస్తోంది.
ఇక మిగిలిన రెండు స్ధానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారు ? ఇపుడిదే విషయమై చర్చలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే రెండు స్ధానాలు ఇప్పటికే రిజర్వు అయిపోతే మిగిలిన రెండు స్ధానాలకు పోటీ బాగా పెరిగిపోతుంది. ఎప్పటినుండో రాజ్యసభ ఎంపీ పదవిపై ఆశలు పెట్టుకున్న వైవీ సుబ్బారెడ్డికి ఇపుడు కూడా నిరస తప్పదనే సమాచారం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారమైతే రెండు స్థానాల్లో కాపులు, ముస్లిం, మహిళ లేదా ఇతర సామాజిక వర్గాలకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే పార్టీ తరఫున ఉన్న ఆరుగురు ఎంపీల్లో రెడ్లు, బీసీలకు మంచి ప్రాధాన్యతే దక్కింది. ఒకదానిలో పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమళ్ నత్వాని ఉన్నారు. బీసీ కోటాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. అలాగే రెడ్డి కోటాలో అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారు. కాబట్టి ఈసారి రెడ్లు, బీసీలకు అవకాశం దాదాపు ఉండదనే అనుకుంటున్నారు.