రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు వేసేవారు ఉండనే ఉంటారు. అందునా.. టీడీపీ అధినేత చంద్రబాబు వంటి కాకలు తీరిన నాయకు డు.. ఊరికేనే ఉంటారా.. చెప్పండి. తనదైన శైలిలో ఆయన దూకుడు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సర్కారును వచ్చే ఎన్నికల్లో గద్దె దింపే దిశగా టీడీపీ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను ఆయన వేలితో ఆయన కన్నునో పొడుచుకునేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ ప్రచార అస్త్రంగా తీసుకునేందుకురెడీ అయింది. నిజానికి ప్రభుత్వ వైఫల్యాలను.. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలు ప్రజలలోకి తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇది ఎక్కడైనా ఉంది. ఎవరైనా అదే చేస్తారు. అయితే.. ఇప్పటి వరకు టీడీపీ ఇలాంటివి అనేకం చేసింది. ఇప్పుడు దీనికి మించి.. అనే రీతిలో.. `జగన్ వేలితో జగన్ కన్ను పొడుద్దాం` అనే వ్యూహాన్ని తెరమీదకి తేనుంది. గత 2019 ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీల్లో కీలకమైన ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేక పోయారు? అనే విషయాన్ని.. ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని.. హోదా అంశాన్ని ముడిపెట్టి.. జగన్‌ను ఇరుకున పెట్టాలని.. బాబు నిర్ణయించారు.
వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో.. ఉన్న హామీల్లో సింహభాగం పూర్తిచేశామని.. సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి, వెనుక బడిన జిల్లాల అభివృద్ధి వంటివాటి విషయంలో మా త్రం.. ఖచ్చితంగా ప్రభుత్వం వెనుకబడిందనే చెప్పాలి. దీంతో ఈ విషయం ప్రతిపక్షానికి, అధికార పక్షానికిమధ్య తీవ్ర వివాదానికి రాజకీయ విమర్శలకు కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో టీడీపీ.. అధినేత చంద్రబాబు.. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. వైసీపీపై వ్యతిరేకత పెరిగేలా చేయాలని తాజాగా నిర్ణయించారు.
దీనిని మూడు దశల్లో అమలు చేయాలని.. ఎన్నికల సమయానికి తీవ్రతరం చేయాలని భావిస్తున్నారు. తొలిదశలో కార్యకర్తలను రంగంలోకి దింపి.. మరోసారి ప్రత్యేక హోదాపై ప్రజల్లో భారీ రేంజ్‌లో చర్చ జరిగేలా చేస్తారు. రెండో దశలో కీలక నేతలను రంగంలోకి దింపి.. జగన్‌ను టార్గెట్ చేస్తారు. మూడో దశలో తనే స్వయంగా రంగంలోకి దిగి.. ప్రజలను కదిలించడం ద్వారా.. వైసీపీ విఫలమైన పార్టీగా ముద్ర వేసేందుకు.. బాబు వ్యూహాలు రెడీ చేసుకుంటున్నారని.. ఈ క్రమంలో అందివచ్చిన పార్టీలను కూడా కలుపుకొని పోతారని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates