వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లకు ముఖ్యమంత్రులకు మధ్య ఏమాత్రం పడటంలేదు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలే నిదర్శనం. ఈ జాబితాలోకి తెలంగాణా కూడా చేరుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మార్చి 7వ తేదీనుండి మొదలవ్వబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం తేల్చేసింది. బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో మొదలవ్వటం ఆనవాయితి.
కానీ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనావాయితీని పాటించాల్సిన అవసరం లేదని కేసీయార్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈమధ్య గవర్నర్ కు కేసీయార్ మధ్య గ్యాప్ మొదలైన విషయం అందరికీ అర్ధమవుతోంది. మొన్నటికి మొన్న వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క-సారక్క జాతర జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. జాతర ముగింపు రోజున గవర్నర్ మేడారం వెళ్ళారు. అయితే అక్కడ గవర్నర్ కు మంత్రులు కానీ జిల్లా అధికారులు కానీ స్వాగతం పలకలేదు.
మేడారం జాతర ముగిపు ఉత్సవాలకు గవర్నర్ హాజరయ్యే ముందువరకు కూడా మంత్రులు, కలెక్టర్, ఎస్పీలు అక్కడే ఉన్నారు. ఇక కొద్ది నిముషాల్లో గవర్నర్ అక్కడికి చేరుకుంటున్నారు అని తెలియగానే మంత్రులు, కలెక్టర్, ఎస్పీలు మాయమైపోయారు. మంత్రులంటే గవర్నర్ ను రిసీవ్ చేసుకోకపోయినా వాళ్ళకొచ్చే నష్టం ఏమీలేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయనేతలు కాబట్టి గవర్నర్ వెంటనే వాళ్ళని చేయగలిగేది ఏమీలేదు.
కానీ కలెక్టర్, ఎస్పీ పరిస్దితి అదికాదు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ వస్తుంటే కలెక్టర్, ఎస్పీలు రిసీవ్ చేసుకుని తీరాలి. గవర్నర్ పర్యటన మొదలై ముగిసి వెళిపోయేంతవరకు కలెక్టర్, ఎస్సీ గవర్నర్ తోనే ఉండాలి. మరి ప్రోటోకాల్ ను కూడా ఉల్లంఘించి కలెక్టర్, ఎస్పీ వెళిపోయారంటే అర్ధమేంటి ? ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాలు లేకుండా ఇది జరగదు కదా. ఇందుకే గవర్నర్-కేసీయార్ మధ్య కూడా గ్యాప్ మొదలైపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates