భారత్ – చైనా మధ్య ఘర్షణలు ఇప్పటికి ఎన్ని జరిగాయి?

భారత్ – చైనాల మధ్య సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. ఆ మాటకు వస్తే.. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉంది. రెండు దేశాల మధ్యనున్న మూడు సరిహద్దులు వివాదంలో ఉన్నవే. మొండితనంతో పాటు.. తన అవసరాలకు తగ్గట్లు.. తన సరిహద్దు దేశాలతో పేచీ పెట్టుకునే చైనాకు గొడవలు మొదట్నించి అలవాటే.

రెండు దేశాల మధ్య ఉన్న మూడు సరిహద్దు ప్రాంతాల్ని చూస్తే..

అందులో మొదటిది మెక్ మోహన్ లైన్.. రెండోది క్లెయిమ్ లైన్.. మూడోది వాస్తవాధీన రేఖ. ఈ మూడింటికి సంబంధించి మూడు రకాల సరిహద్దు రేఖలు ఉన్నాయి. ఇందులో మెక్ మోమన్ లైన్ ను చైనా అంగీకరించట్లేదు. క్లెయిమ్ లైన్ ను భారత్ గుర్తించట్లేదు. ఎల్ ఏసీని రెండు దేశాలు అంగీకరించినా గొడవలు మాత్రం సాగుతున్నాయి. జమ్మూకశ్మీర్ ను బ్రిటిష్ ఇండియా 1846లో కలుపుకుంది. ఇప్పుడున్న గుర్తించని సరిహద్దు ప్రాంతాల్ని ఉభయ దేశాల మధ్య సరిహద్దులుగా చైనాను ఒప్పించాలని బ్రిటిష్ పాలకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో విడుదల చేసిన మ్యాప్ లో లద్దాఖ్ ను గుర్తించని సరిహద్దు ప్రాంతంగా పేర్కొన్నారు. ఇది జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత అంటే 1959 ప్రాంతంలో అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్ లై సరిహద్దు సమస్య పరిష్కారం కోసం భారత ప్రధాని నెహ్రుకు లేఖ రాశారు. అందులో ఆయన ప్రస్తావించిన అంశం ఏమంటే.. మెక్ మోహన్ రేఖను తూర్పు సరిహద్దుగా అంగీకరిస్తామని.. అందుకు బదులుగా లద్దాఖ్ లో అప్పటికే రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్ని సరిహద్దుగా గుర్తించాలని మెలికి పెట్టారు. ఈ ప్రతిపాదనను అప్పటి ప్రధాని నెహ్రూ నో చెప్పారు. దీంతో.. ఈ ఇష్యూ అలా ఉండిపోయింది. కట్ చేస్తే.. 1993లో శాంతిసామరస్య ఒప్పందం జరిగింది. అందులో మొత్తం సరిహద్దు వివాద ప్రాంతాన్ని ఎల్ ఏసీగా గుర్తించాలని రెండు దేశాలు అంగీకరించాయి.

చైనాతో సరిహద్దు తగాదాల చరిత్ర ఇప్పటిది కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చూస్తే.. రికార్డు చేసుకోవాల్సినంత పెద్ద ఘర్షణలు ఏమేం జరిగాయన్నది చూస్తే.. ఇందులో చైనా దూకుడే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతిసారీ ఏదోలా కెలికే వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అవేమంటే..

1962: చైనా-భారత్‌ యుద్ధం. అక్సాయ్‌చిన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ను ఆక్రమించిన చైనా.

1967: చుంబు వ్యాలీపై పట్టుకై నాథులా పాస్‌ వెంట చైనా సైన్యం దాడి. ఉభయ సేనల ఘర్షణలతో 88 మంది భారత సైనికులు.. 340 మంది చైనా ట్రూపర్లు మరణం.

1987: అరుణాచల్‌ ప్రదేశ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తూ భారత్ నిర్ణయం. చైనా అగ్రహం. ఈ సందర్భంగా ఇరు దేశ సైనికుల మధ్య ఘర్షణ (సులులా.. బుమ్ లా పాస్ ల వద్ద)

2013: అక్సాయ్‌చిన్‌ వద్ద రకీ నులా వద్ద స్థావరాన్ని ఏర్పాటు చేయటానికి చైనా ప్లాన్. అందుకు ధీటుగా ఆ స్థావరానికి 300 మీటర్ల చేరువలో శిబిరాన్ని ఏర్పాటు చేసిన భారత్. ఆ సందర్భంగా తన సైన్యాన్ని భారీగా మొహరించిన చైనా. చివరకు సేతల్ని ఉపసంహరించుకున్నారు.

2014: తన భూభాగంలోని దెంచాక్‌లోని గ్రామాలకు నీటి కోసం వంద అడుగుల కెనాల్ తవ్వాలని భారత్ నిర్ణయం. దీనిపై చైనా అభ్యంతరం. మూడు వారాల పాటు సంక్షోభం. ఆ సమయంలో భారత భూభాగంలోని 5 కి.మీ. మేర చొరబడిన వైనం. మరోసారి ఘర్షణలు. చివరకు వెనక్కి తగ్గిన చైనా.

2015: ఉత్తర లద్దాఖ్‌లోని బర్ట్సేలో శిబిరం నిర్మించిన చైనా. ధ్వంసం చేసిన భారత బలగాలు.

2017: 73 రోజులపాటు డోక్లాం సంక్షోభం. భూటాన్‌ భూభాగంలో రోడ్డు నిర్మాణానికి చైనా యత్నం. భూటాన్‌కు దన్నుగా రంగంలోకి భారత బలగాలు. చర్చల తర్వాత ఉభయ బలగాల ఉపసంహరణ. రోడ్డు నిర్మాణం నిలిపివేత.

2018: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దును దాటి 400 మీటర్లు లోపలకు చైనా బలగాల చొరబాటు. భారత్‌ రోడ్డు నిర్మించకుండా అడ్డుకునే ప్రయత్నం. ఆ సందర్భంగా మరోసారి ఘర్షణ.