ఈ రోజు అనిల్ లేకపోతే మేము లేము…

ఒక‌ప్పుడు నిల‌క‌డ‌గా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర‌ నిర్మాత దిల్ రాజు.. గ‌త కొన్నేళ్లుగా స‌రైన విజ‌యాలు లేక ఇబ్బంది ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. జాను, వి, రౌడీ బాయ్స్, థాంక్యూ, శాకుంత‌లం, ఫ్యామిలీ స్టార్.. ఇలా గ‌త నాలుగైదేళ్ల‌లో ఆయ‌న చాలా ఫ్లాపులు ఎదుర్కొన్నారు. ఈ సంక్రాంతి మీద రాజు భారీ ఆశ‌లు పెట్టుకోగా.. ముందుగా ఆయ‌న్నుంచి వ‌చ్చిన గేమ్ చేంజ‌ర్ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.

ఏకంగా 450 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ సినిమా.. ఓపెనింగ్స్ వ‌ర‌కు ప‌ర్వాలేద‌నిపించినా, ఆ త‌ర్వాత డౌన్ అయింది. దీంతో రాజు, ఆయ‌న బ‌య్య‌ర్ల‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌ప్ప‌ద‌నే సంకేతాలు క‌నిపించాయి. అయితే ఇంత‌లోనే రాజు సంస్థ నుంచి వ‌చ్చిన మ‌రో చిత్రం సంక్రాంతికి వ‌స్తున్నాం మాత్రం పాజిటివ్ టాక్, అదిరిపోయే వ‌సూళ్ల‌తో మొద‌లైంది. ఈ సినిమా అంచ‌నాల‌ను మించిన విజ‌యం సాధించ‌బోతోంద‌ని.. రాజు న‌ష్టాల‌న్నింటినీ కూడా భ‌ర్తీ చేయ‌బోతోంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే రాజు త‌మ్ముడు, ఎస్వీసీ సంస్థ బ్యాక్ బోన్ అయిన శిరీష్.. సంక్రాంతికి వ‌స్తున్నాం ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మీద ప్ర‌శంస‌లు కురిపించాడు. త‌మ ప‌నైపోయింద‌నుకున్న స‌మ‌యంలో అనిల్ వ‌ల్లే నిల‌బ‌డ్డామ‌ని.. అత‌డికి రుణ‌ప‌డి ఉంటామ‌ని శిరీష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ”ముందుగా మేం ఎన్టీఆర్ ఆర్ట్స్ హ‌రి గారికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి. ఆయ‌న మాకు ప‌టాస్ సినిమా చూపించ‌క‌పోయి ఉంటే అనిల్‌తో మా బంధం ఉండేది కాదు.

ఆ సినిమాను మేం రిలీజ్ చేశాక అనిల్‌తో వ‌రుస‌గా సినిమాలు తీశాం. మా కాంపౌండ్ నుంచి అత‌ణ్ని బ‌య‌టికి పంపించ‌లేదు. ఈ రోజు అనిల్ లేకుంటే మేం లేము. కొంత కాలంగా మాకు వ‌రుస‌గా స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి.. మేం ఎప్పుడు కింద ప‌డ‌తామా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక మేం బావిలో ప‌డిపోయాం అని అనుకున్నాం. కానీ అంత‌లో బ‌య‌ట‌ప‌డ్డాం. అందుకు కార‌ణం అనిలే.

ఈ ఒక్క‌ సినిమాతో మా స‌మ‌స్య‌ల‌న్నీ తీరిపోతాయ‌ని అత‌ను చెప్పాడు. పైన త‌థాస్తు దేవ‌తలు ఏమైనా ఉన్నారేమో కానీ.. అత‌ను చెప్పిన‌ట్లే జ‌రిగింది. ఈ సినిమాతో మా ప్రాబ్ల‌మ్స్ అన్నీ తీరిపోయాయి” అని శిరీష్ వ్యాఖ్యానించాడు. మ‌రోవైపు దిల్ రాజు కూడా అనిల్ మీద ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు.

అనిల్‌ను చూసి ప్ర‌మోష‌న్స్ ఎలా చేయాలో తాము నేర్చుకోవాల‌ని.. అత‌డికి హీరో వెంక‌టేష్ అన్ని ర‌కాలుగా స‌హ‌క‌రించారు కాబ‌ట్టే ఇంత పెద్ద విజ‌యం సాధ్య‌మైంద‌ని సంక్రాంతికి వ‌స్తున్నాం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్ల‌లో రాజు వ్యాఖ్యానించాడు.