జగన్ ఏంటి.. జనసేన జేబు నింపడం ఏంటి అని ఆశ్చర్యంగా అనిపిస్తోందా? అదే చిత్రం. జనసేనాని దెబ్బ కొట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని పవన్ అభిమానులు, జనసైనికులు తిప్పికొట్టే క్రమంలో జరుగుతున్న ఆశ్చర్యకర పరిణామమిది. 2014లో తాను ముఖ్యమంత్రిని కాకపోవడానికి చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణే కారణమని నమ్మే జగన్.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా జనసేన అధినేతను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా పవన్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసే లక్ష్యంతో అతడి సినిమాలను టార్గెట్ చేస్తోంది జగన్ సర్కారు. పోయినేడాది ఉన్నట్లుండి టికెట్ల రేట్లు తగ్గించి, బెనిఫిట్ షోలు, అదనపు షోలు రద్దు చేసి ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని ఎలా ఇబ్బంది పెట్టారో తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించి.. ఇప్పుడు మళ్లీ ‘భీమ్లా నాయక్’ మీద ఉక్కుపాదం మోపుతోంది ఏపీ ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ నుంచి వీఆర్వోల వరకు వ్యవస్థ మొత్తం రెండు రోజులుగా ‘భీమ్లా నాయక్’ మీదే ఫోకస్ పెట్టింది.
ఐతే సామాన్య ప్రేక్షకులకు సైతం ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు మరీ అన్యాయంగా అనిపిస్తున్నాయి. నిత్యావసరాలు సహా అన్ని ధరలూ భారీగా పెరిగిపోయిన ఈ రోజుల్లో 10, 20కి టికెట్ల ధరలు ఉండటం ఎవ్వరికీ సమంజసంగా అనిపించడం లేదు. ఇక ఈ విషయంలో పవన్ అభిమానులు, జనసైనికుల ఆక్రోశం ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో జనసేన మద్దతుదారులు సోషల్ మీడియాలో ఆసక్తికర పిలుపునిస్తూ వీడియోలు, పోస్టులు పెడుతున్నారు.
టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతకు నష్టం వస్తుందని.. ఆ మేర పవన్ కళ్యాణ్ కూడా తన పారితోషకం తగ్గించుకుంటున్నాడని.. ఇప్పుడు టికెట్ల ధరల తగ్గింపుతో మిగిలే మొత్తానికి ఇంకొంచెం కలిపి జనసేనకు విరాళంగా ఇవ్వాలని వారు పిలుపునిస్తుండటం విశేషం. ఇంటర్నెట్లో పవన్ అభిమానులు, జనసేన మద్దతుదారుల మధ్య ఈ మెసేజ్ బాగానే తిరుగుతోంది. జనసేనకు విరాళం ఇచ్చి ఆ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి, మిగతా వాళ్లనూ ఇన్‌స్పైర్ చేస్తున్నారు. ఈ రకంగా జగన్ సర్కారు పరోక్షంగా జనసేన జేబు నింపుతోందనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates