వివేకా హత్య కేసు నిందితుల‌కు జ‌గ‌న్ అభ‌యం.. టీడీపీ కామెంట్స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేస్తుందని టీడీపీ నేత బోండా ఉమా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలదేనని వ్యాఖ్యానించారు.  వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ అధికారుల ఫోన్ నెంబర్లు.. రాష్ట్ర పోలీసుల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేరుతున్నాయని ఆరోపించారు. గతంలో.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు కర్ణాటకలో విచారణ జరిగినట్లు వివేకా హత్య కేసు విచారణ కూడా వేరే రాష్ట్రంలో జరపాలని బొండా డిమాండ్ చేశారు.

బాబాయ్ హత్యకేసు వెలికితీస్తున్న సీబీఐ అధికారులపై కేసు పెట్టించిన జగన్ రెడ్డి.. చరిత్రకెక్కారని బొండా దుయ్యబట్టారు. జగన్ ఆడుతున్న జగన్నాటకంలో భాగంగా అవినాష్ రెడ్డిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని అన్నారు. తాడేపల్లి ఆదేశాలు సీబీఐ పాటించట్లేదని ఏకంగా వారిపైనే కక్షకట్టారని బొండా ఉమా విమర్శించారు. ఎఫ్ఐఆర్ నమోదైన సీబీఐ అధికారి రాంసింగ్ను హత్య చేసినా ఆశ్చర్యం లేదన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయన్నారు. సీబీఐపై కేసు పెట్టిన ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు విచారించాలో వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. అప్రూవర్గా మారిన దస్తగిరి హత్యకు పెద్దఎత్తున కుట్రలు జరుగుతున్నాయని బొండా ఆరోపించారు.

మ‌రోవైపు.. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తనను సీబీఐ ఏఎస్పీ రామ్సింగ్ బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి కడప కోర్టును ఆశ్రయించారు. కడప కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు రామ్సింగ్పై 195ఏ, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును సవాల్ చేస్తూ ఏఎస్పీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రామ్ సింగ్ వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు.

అయితే.. కడప పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్సింగ్పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనపై కడప పోలీసులు నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని కోరుతూ రామ్ సింగ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఉదయ్ కుమార్ను ఏఎస్పీ బెదిరించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.