వివేకా హ‌త్య‌.. 10 ఎక‌రాల భూమి ఇస్తామ‌న్నారు

సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన‌ దస్తగిరి వాంగ్మూలం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై సీబీఐకి ఫిర్యాదు చేశాడు. తనను కలిసిన వారి వివరాలను సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చారు. దస్తగిరివాంగ్మూలం తర్వాత తనను భరత్ యాదవ్ కలిశాడని పేర్కొన్నాడు. ఎంపీ అవినాష్‌రెడ్డి తోట వద్దకు రావాలని భరత్‌ యాదవ్‌ అడిగినట్లు తెలిపాడు.

అంతేకాదు.. తన ఇంటి సమీప హెలిపాడ్ వద్దకు భరత్ యాదవ్‌, న్యాయవాది వచ్చారని ద‌స్త‌గిరి వెల్ల‌డించాడు. భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పంపించారని.. 10-20 ఎకరాల భూమి ఇస్తామన్నారని చెప్పాడు. ఎంత డబ్బు కావాలో చెప్పమన్నారని స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. భరత్‌ యాదవ్ తనను తరచుగా అనుసరిస్తున్నాడని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ద‌స్త‌గిరి వెల్ల‌డించాడు.

మ‌రోవైపు.. వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మెజిస్ట్రేట్‌ బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. రిమాండ్‌, వాయిదా, బెయిల్‌ అంశాలు కడప కోర్టులోనేనని మెజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్‌ నలుగురికి సీబీఐ అభియోగ పత్రాల వివరాలు అందించారు.

అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడవును న్యాయస్థానం.. 14 రోజుల పాటు పొడిగించింది. కడప జైలులోని సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలను కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకువచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.