మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి.. తెలుసుకోవాల్సిన విషయాలు!

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు లేనప్పటికీ.. కాస్త తక్కువగా అయినా రాష్ట్ర మంత్రులకు ప్రత్యేకించి ఒక చరిష్మా ఉండేది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరగటం.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నట్లుగా మారిపోవటం.. వార్తల విషయంలోనూ ఒకే మీడియా సంస్థ ఏ రాష్ట్రానికి చెందిన వార్తల్ని ఆ రాష్ట్రానికి పరిమితం చేస్తూ..పెద్ద అడ్డుగోడ కట్టేయటం తెలిసిందే. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న మరో మార్పు ఏమంటే.. ముఖ్యమంత్రులు మాత్రమే ఫోకస్ అయి.. మిగిలిన మంత్రులు పెద్దగా కనిపించకపోవటం.

ఒకవేళ మీడియాలో కనిపించాలంటే నిత్యం బండబూతులు తిట్టటం.. రాజకీయ ప్రత్యర్థులను దునుమాడటంతో లేదంటే వివాదాస్పద వైఖరిని ప్రదర్శించటం లాంటివి చేసేవారు మాత్రమే మంత్రులుగా అందరి నోట్లో నానుతున్నారు. అందుకు భిన్నంగా తన పని తాను చూసుకోవటం.. తనకు అప్పగించిన పనిని నీతిగా.. నిజాయితీగా.. వందశాతం కమిట్ మెంట్ తో పని చేసే వారిని పెద్దగా పట్టించుకోని పరిస్థితి. పాజిటివ్ న్యూస్ కంటే నెగిటివ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మీడియా సంస్థల తీరు కూడా మరో కారణంగా చెప్పాలి.
మేకపాటి గౌతమ్ రెడ్డి విషయాన్నే తీసుకుంటే.. ఆయన మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన చాలా విషయాలు రెండు తెలుగు రాష్ట్రాల వారికి తెలిసి.. ఆశ్చర్యపోతున్న వారు ఎక్కువ. నెల్లూరు జిల్లాతో పాటు ఆ పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా వారికి కొంత చిత్తూరు జిల్లాలోని వారికి (తిరుపతి ముందు వరకు ఉన్న ప్రాంతాల్లోని వారికి) మేకపాటి సుపరిచితులే.

వైసీపీ నేతలు అన్నంతనే ఫైర్ బ్రాండ్ లుగా.. ప్రత్యర్థులపై విరుచుకుపడతారన్న పేరు ఉంటుంది. కానీ.. గౌతమ్ రెడ్డి అందుకు భిన్నం. అంతేకాదు.. ఇవాల్టి రోజున అవినీతి మరక అంటని నేత ఉండరు. కానీ.. గౌతమ్ రెడ్డి మాత్రం దీనికి దూరంగా ఉంటారు. అంతేనా.. రాజకీయాలకు ఏ మాత్రం సూట్ కానట్లుగా చెప్పే సౌమ్యంగా ఉండటం గౌతమ్ రెడ్డి సొంతం. అంతేకాదు.. తన జిల్లా వారే కాదు.. ఇరుగుపొరుగు వారు ఎవరు తన వద్దకు వచ్చినా వారి పనులకు రియాక్టు కావటం ఒక ఎత్తు.. ఎన్నో పనుల్లో తలమునకలై ఉండి కూడా ఫోన్ కు అందుబాటులో ఉండటం.. ఒకవేళ బిజీగా ఉంటే.. మళ్లీ చేస్తానని చెప్పటం లాంటివి గౌతమ్ ను మిగిలిన వారికి భిన్నంగా నిలిపేలా చేస్తాయి.

అంతేకాదు.. పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడైనా.. ఆ అహం ఆయనలో మచ్చుకు కూడా కనిపించదు. వేలాది కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ అలాంటివి మచ్చుకు కూడా కనిపించని తీరు ఆయన సొంతం. ఎవరు వచ్చినా అప్యాయంగా మాట్లాడటం.. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా మర్యాదగా వ్యవహరించటం కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా అందరితోనూ ఆత్మీయంగా వ్యవహరించటం..  ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన్ను రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అభివర్ణిస్తూ ఉంటారు. గౌతమ్ కు సంబంధించినంత వరకు నెల్లూరు జిల్లా అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. అందుకే.. ఎవరు పెట్టుబడులు పెడతానని చెప్పినా.. తమ జిల్లాలో పెట్టాలని కోరేవారు.

జగన్ ప్రభుత్వాన్ని.. వైసీపీ నేతల్ని చీల్చి చెండాడే మీడియా సంస్థలుగా గుర్తింపు పొందిన వాటిల్లోనూ.. మేకపాటి గౌతమ్ గురించి రాసిన వార్తలు చూస్తే.. ఆయన గొప్పతనం ఇట్టే బయట పడుతుంది. అవినీతి మచ్చ లేని నేతగా.. సమర్థుడిగా పేర్కొనటమే కాదు.. ఆయన వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లుగా పేర్కొంటూ.. భారీ ఎత్తున ఇచ్చిన కవరేజ్ ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసేలా ఉందని చెప్పక తప్పదు.