అంచనాలు తప్పు అయ్యాయి. రాజ్యసభ సీటు ఖాయమని కొందరు.. కాదు ఈసారి పద్మశ్రీ పురస్కారం ఖాయమని మరికొందరు.. ఇలా ఎవరికి తోచింది వారు అనుకుంటున్న వేళ.. తనకు అత్యంత విధేయుడు.. మద్దతుదారు అయిన సినీ నటుడు కమ్ కమెడియన్ అలీకి కీలక బాధ్యతలు అప్పచెబుతూ నిర్ణయం తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అదే సమయంలో టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం పలువురు ప్రముఖులు సీఎం జగన్ ను కలిసి.. వినయపూర్వకంగా విన్నవించుకున్నప్పటికీ ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. అదే సమయంలో ఆలీకి పదవిని కట్టబెట్టటం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సీఎం జగన్ తో సినీ ప్రముఖులతో భేటీ వేళ.. అనూహ్యంగా సీఎం క్యాంప్ ఆఫీసులో కమెడియన్ ఆలీ ప్రత్యక్షం కావటం.. అలీతో పాటు పోసాని మురళీ కూడా ఉండటం తెలిసిందే.
ఈ సమావేశంలో అలీని ఉద్దేశించి సీఎం జగన్.. తాను త్వరలోనే పిలుస్తాను.. శుభవార్త చెబుతానని చెప్పటంతో అలీకి ఏదో ఒక పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో.. ఏపీ నుంచి పార్లమెంటులో ముస్లింలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆయన్ను ఎంపీగా ఎంపిక చేస్తారన్నమాట వినిపించింది. సినీ ప్రముఖులతో భేటీ సందర్భంగా తాను చెప్పిన మాటను వారం వ్యవధిలోనే పూర్తి చేసి శుభవార్తను అధికారిక ఆదేశాల రూపంలో విడుదల చేసిన ఏపీ సర్కారు.. టాలీవుడ్ ఇష్యూల మీద ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటివరకు వెల్లడించకపోవటం విశేషం.
సినీ నటుడు అలీకి కీలక బాధ్యత అప్పజెప్పటానికి కారణం లేకపోలేదు. 2019 ఎన్నికల వేళలో సినీ రంగానికి చెందిన వారు ఎవరూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకలేదు. ఇలాంటి వేళలో తనకు అత్యంత సన్నిహితుడైన పవన్ కల్యాణ్ ను కాదని మరీ.. జగన్ కు అలీ భేషరతు మద్దతు ప్రకటించటం.. అయనకు అండగా నిలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో జగన్ పార్టీ ఘన విజయాన్ని సాధించినప్పటికీ.. తనకు ఎలాంటి పదవి కావాలని కోరకుండా ఉన్న ఆలీకి.. ప్రభుత్వం ఏర్పడిన దాదాపు మూడేళ్ల వేళ.. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవిని ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలీకి స్వీట్ న్యూస్ చెప్పేసిన సీఎం జగన్.. టాలీవుడ్ కు మరెప్పుడూ చెబుతారో?