అధికార ప్రభుత్వానికి ఉద్యోగుల విధేయులుగా పని చేయాల్సిందే. లేదంటే అధికారంలో ఉన్న నాయకుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకున్నా.. కొంతమంది ఉద్యోగులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. అధినేతకు కోపం వస్తే ఎంతటి వారికైనా వేటు పోటు తప్పదనేలా పరిస్థితులు మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరూ ఏ పదవిలోనూ శాశ్వతం కాదు.. అందరూ జగన్ ఆడించే నాటకంలో పాత్రలు మాత్రమేనని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.
విధేయుడిగా పేరు..
తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై అనూహ్యంగా బదిలీ వేటు పడింది. ఆకస్మికంగా ఆయన్ని బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన్నిసాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఇంటిలిజెన్స్ విభాగం అధిపతి కేవీ రాజేంద్రనాథ రెడ్డిని డీజీపీగా నియమించింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ మొదటి నుంచి జగన్ విధేయుడిగా సాగారు. ప్రభుత్వ అవసరాల మేరకు నడుచుకున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు. వైసీపీ నేతలు చెప్పినట్లు విన్న ఆయన.. ప్రత్యర్థి పార్టీల నాయకులపై కేసులు పెట్టించారనే ఆరోపణలున్నాయి.
ఆ ఆందోళనతో ఆగ్రహం..
జగన్ చేతిలో కీలుబొమ్మగా మారి తన బాధ్యతలను సవాంగ్ పూర్తిగా విస్మరించారని ప్రత్యర్థి పార్టీలతో పాటు ప్రజలు కూడా విమర్శించారు. అలాంటి అధికారిని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసింది. అయితే పీఆర్సీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఇటీవల ఉద్యోగులు చేసిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అవడంపై జగన్ సీరియస్ అయ్యారని తెలిసింది. పోలీసులు ఆంక్షలు పెట్టినా లక్షల మంది ఉద్యోగులు విజయవాడకు ఎలా చేరుకున్నారని డీజీపీని జగన్ ప్రశ్నించారని సమాచారం. ఆ ఆగ్రహంతోనే ఇప్పుడు ఆయన్ని బదిలీ చేశారని ప్రతిపక్షాలు అంటున్నాయి.
గతంలోనూ ఇలాగే..
జగన్ ప్రభుత్వం తమకు విధేయులుగా ఉన్న అధికారులకు ఇలాంటి షాక్‌లు ఇవ్వడం ఇదేం కొత్తకాదు. గతంలో ఏరికోరి చీఫ్ సెక్రటరీగా కొనసాగించిన ఎల్వీ సుబ్రమణ్యాన్ని రాత్రికి రాత్రే ఆ పదవి నుంచి జగన్ తప్పించిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ ఎల్వీ అన్నా అని ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చిన జగన్.. ఆయన్ని ఏ మాత్రం ప్రాధాన్యం లేని బాపట్లలోని మానవ వనరుల కేంద్రానికి డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ తన స్థాయికి అది చాలా చిన్న పోస్టు అని భావించిన ఎల్వీ అక్కడ చేరకుండా సెలవులో కొనసాగి చివరికి పదవీ విరమణ చేశారు. ఇక ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయ కీలక అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌పై కూడా బదిలీ వేటు పడింది. సీఎం ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా వెలుగు వెలిగిన ఆయన చివరకు ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్లారు.