కేంద్రంలోని బీజేపీ సర్కారు వర్సెస్ కేసీఆర్ అన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీని దేశం నుంచి తరమికొట్టాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీను వెళ్లగొట్టేందుకు జనాల మద్దతు ఉంటే కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు.
మరోవైపు బీజేపీపై పోరుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌లతో మాట్లాడుతున్నానని ఆయన పేర్కొన్నారు. తాజాగా విద్యుత్ చట్టం పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతులు పొట్టగొట్టాలని కేంద్రం చూస్తుందని కేసీఆర్ ఆరోపించారు.
విద్యుత సంస్కరణల పేరిట అన్ని వర్గాల ప్రజల కడుపు కొట్టేందుకు కేంద్రం సిద్ధమైందని కేసీఆర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నేతలు జుట్టు, గడ్డాలు పెంచుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణ సంఘం ఓ సంచలన నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణం. బీజేపీ నేతలకు క్షవరాలు చేయకూడదని ఆ సంఘం తీర్మానించింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు వల్ల కులవృత్తులకు ముప్పు ఏర్పడిందని రాష్ట్ర రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం కింద కులవృత్తుల వాళ్లకు 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనివల్ల ముఖ్యంగా రజక, నాయీ బ్రాహ్మణులకు మేలు జరుగుతోంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చే విద్యుత్ సంస్కరణల వల్ల ఈ పథకం రద్దయ్యే ప్రమాదం పడుతుందని ఈ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20 నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేస్తామని ప్రకటించారు. అదే విధంగా ఆ రోజు నుంచే బీజేపీ నేతలకు క్షవరం చేయమని నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ప్రకటించారు. నూతన విద్యుత్ చట్టం ముసాయిదాలో సబ్సిడీలు ఎత్తివేయాలని, ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలని పేర్కొనడం దారుణమని వాళ్లు పేర్కొన్నారు.