గత కొద్దికాలంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విరుచుకుపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కామెంట్లలోని విశ్వసనీయతను తేల్చి చెప్పేందుకు కీలక అవకాశం దొరికింది. భారత ప్రభుత్వ విధివిధానాలపై స్పందించడమే కాకుండా రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అయిన గవర్నర్ల పాత్రపై సైతం అసహనం వ్యక్తం చేస్తున్న కేసీఆర్ కు సరిగ్గా ఇదే అంశంలో కలిసివచ్చే తోటి సీఎంలతో ముందుకు సాగే సందర్భం ఎదురైంది. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ, అధికార దుర్వినియోగంపై చర్చించేందుకు త్వరలో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
త్వరలో జరగబోతున్న సమావేశం గురించి ఓ ట్వీట్లో స్టాలిన్ వివరించారు. ‘‘మమత దీదీ నాకు ఫోన్ చేశారు. నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార దుర్వినియోగంపై ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల సీఎంలతో మీటింగ్ నిర్వహించాలని ఆమె సూచించారు” అని స్టాలిన్ ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని నిలబెట్టే విషయంలో డీఎంకే కట్టుబడి ఉంటుందని నేను మమతకు హామీ ఇచ్చాను. త్వరలో ప్రతిపక్ష పార్టీల సీఎంల సమావేశం జరుగుతుంది”అని స్టాలిన్ వెల్లడించారు.
కాగా, తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ గవర్నమెంట్లో గవర్నర్ల వ్యవస్థ ఎక్కువగా దుర్వినియోగం అవుతోందని కేసీఆర్ ఆరోపించారు. “గవర్నర్ల వ్యవస్థనే బాగా పని చేయడం దని సర్కారియా కమిషన్ కానీ, మరొకరు కానీ ఘోరంగా వివరించారు.
అసలీ వ్యవస్థ ఇట్ల ఉండకూడదు. చాలా ఇబ్బందులు పెడుతున్నరు. చాలా దురదృష్టం. తప్పకుండా దానిమీద ఆలోచన జరగాల్సిందే. ఉత్తరాఖండ్‌లో గవర్నమెంట్‌ను బర్తరఫ్ చేస్తే.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అనేది ఏ రకంగా మంచిది కాదు. ఎవరికి వారు గౌరవంగా బతకాలి. గవర్నర్ల వ్యవస్థ గురించి స్టాలిన్ ట్వీట్ నేను కూడా చూశా. “ అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, తాను ఈ సమావేశానికి హాజరుకానున్నానో లేదో కేసీఆర్ చెప్పకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates