ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా సీఎం జగన్ చప్పుడు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు కేంద్రంపై పోరుబాటలో సాగుతుంటే.. వైసీపీ మాత్రం కిమ్మనడం లేదు. ఇప్పటికే అన్ని విషయాల్లో జగన్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విద్యుత్ మీటర్ల విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చేలా జగన్ వ్యవహరిస్తున్నారనే అర్థం వచ్చేలా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజాగా కేంద్రంపై మరోసారి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. విద్యుత్ మీటర్లను తప్పనిసరిగా వ్యవసాయ మోటార్లకు బిగించాలనే కేంద్రం ప్రతిపాదనలను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిపైనే మాట్లాడుతూ ఇంకా చట్టం చేయనప్పటికీ రాష్ట్రాలు ఆ నిబంధనలు పాటించేలా కేంద్రం ఒత్తిడి చేస్తుందని కేసీఆర్ అన్నారు.
ఆ క్రమంలోనే ఏపీలోని శ్రీకాకుళంలో అక్కడి ప్రభుత్వం 25 వేల మీటర్లు బిగించిందని కేసీఆర్ వెల్లడించారు. విద్యుత్‌ను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందనే అందుకే ఇలా మీటర్లు బిగించే కుట్రకు తెరతీసిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌ను ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేంద్రానికి భయపడి జగన్ ఒక్క మాట అనడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేసులకు భయపడే జగన్ సైలెంట్‌గా ఉన్నారని ఆరోపిస్తున్నారు. పోలవరానికి నిధులు ఇవ్వకపోయినా.. కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రస్తావన లేకపోయినా జగన్ మాత్రం స్పందించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. ఇప్పుడిక కేంద్రం ఒత్తిడికి తలొగ్గి జగన్ విద్యుత్ మీటర్లకు ఒప్పుకున్నారనే అర్థం వచ్చేలా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడారు. ఓ వైపు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తుంటే జగన్ ఒకే చెప్పడంతోనే కేంద్రంపై ఆయన వైఖరి స్పష్టమవుతుందనే విమర్శలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates