సీనియర్ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి కొంత కాలంగా సినిమా కార్యక్రమాలకు, మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఆయనకు సినిమాలు కూడా తగ్గినట్లుగా కనిపిస్తోంది. చాన్నాళ్లకు ఆయన తాను కీలక పాత్ర పోషించిన సన్ ఆఫ్ ఇండియా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్నపుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
సంబంధిత వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించి కొంత వైరాగ్య ధోరణిలో మాట్లాడారు పోసాని. అంతే కాక తెలుగు సినీ పరిశ్రమ తనను బహిష్కరించిందన్న కోణంలో ఆయన మాట్లాడటం గమనార్హం. వందల సినిమాలకు పని చేసిన పరుచూరి సోదరులనే దూరం పెట్టిన ఇండస్ట్రీ ఇదని.. అలాగే ఆత్రేయ లాంటి దిగ్గజాన్ని కూడా దూరం పెట్టారని.. వీళ్లలాగా బతకకూడదని తాను నేర్చుకున్నానని పోసాని వ్యాఖ్యానించారు.
తెలుగు సినిమా పరిశ్రమ తనను బహిష్కరించినా.. తన తర్వాతి తరాలు కూడా బతికేంత సంపాదించుకున్నానని.. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని.. సినీ పరిశ్రమ నుంచి తాను ఇప్పుడు ఏమీ ఆశించడం లేదని.. ఇది తనకు బోనస్ అని ఆయన అన్నారు. పోసాని మాటల్ని బట్టి చూస్తే.. తనను ఉద్దేశపూర్వకంగా సినిమాల నుంచి పక్కన పెడుతున్నారనే అర్థం ధ్వనిస్తోంది. గత ఏడాది జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఏపీ సీఎం జగన్‌ను విమర్శించినందుకు పోసాని ప్రెస్ మీట్ పెట్టి పవన్‌ను విమర్శించడం.. ఆ తర్వాత పవన్ అభిమానులు తనను బెదిరించినందుకు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ మీద వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో దూషణలకు దిగడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో పోసానికి అవకాశాలు తగ్గినట్లుగా కనిపిస్తోంది. తనను కావాలనే దూరం పెడుతున్నారన్న ఉద్దేశంతో పోసాని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates