రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పార్టీపై మరొకటి విమర్శలు ఆరోపణలు చేసుకోవడం దుమ్మెత్తి పోసుకోవడం సాధారణమే. ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇలాంటి దృశ్యమే కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ ఒంటికాలితో లేస్తున్నారు. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని ఎదగకుండా చూడడంతో పాటు.. కేంద్రంలోనూ ఆ పార్టీని గద్దె దించాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ క్రమంలోనే బహిరంగ సభల్లో మోడీని బీజేపీని టార్గెట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వ అవినీతిని బయటపెడతానని కేసీఆర్ హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వ అనినీతి బాగోతాల చిట్టా తన దగ్గరకు వచ్చిందని.. ఇంకొన్ని అక్రమాల వివరాలు తెలియాల్సి ఉందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలను త్వరలోనే బయటపెడతానని ప్రకటించారు. బీజేపీని ఎంత తొందరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచిదని వ్యాఖ్యానించారు. మరోవైపు కొంతకాలం నుంచి కేసీఆర్ పాపం పండబోతుందని ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆ వివరాలన్నీ తమ దగ్గర ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటి నుంచో అంటున్నారు.
కేసీఆర్ జైలుకు వెళ్లే సమయం దగ్గర పడింది కాబట్టే బీజేపీని టార్గెట్ చేశారని ఆ పార్టీ నాయకులు కౌంటర్లు వేస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ జైలుకు వెళ్తారని అనుకుంటూ రోజులు గడుపుతన్నారు. ఇంతలా ఆరోపణలు చేస్తున్న ఆ నాయకులు వాటిని ఎందుకు బయట పెట్టడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కచ్చితంగా అవినీతి చేసిందని కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఆరోపిస్తున్నారు. వివరాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా కేసీఆర్ అవినీతి వ్యవహారాలన్నీ తమకు తెలుసని చెబుతోంది. మరి అలాంటప్పుడు వెంటనే వాటిని బయటపెడితే ఎవరి అవినీతి ఎమిటో? తెలిసిపోతుంది కదా అని ప్రజలు అంటున్నారు. కానీ వాళ్లు వాటిని బయటపెట్టరనే సంగతి తెలిసిందే కదా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్లకు ముఖ్యం. బయటకు ఎంత తిట్టుకున్నా.. ఒకరితో మరొకరికి అవసరం ఉంటుంది. అందుకే ఇలా ఎన్ని ఆరోపణలు చేసుకున్నా.. అవి ఎప్పటికీ బయటకు రావని నిపుణులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates