కాంగ్రెస్‌లో రాహుల్.. ఓ రాహుకాలం

గ‌త కొంత‌కాలంగా త‌మ‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి పార్ల‌మెంటు స‌మావేశాల ముగింపు సంద‌ర్భంగా బీజేపీ అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ నేత‌గా రాహుల్ గాంధీ ఉండ‌నున్నారు అనే అంచ‌నాల‌కు చెక్ పెట్టేలా ఆయ‌న నాయ‌క‌త్వంపై సందేహాలు పుట్టేలా.. కాంగ్రెస్ పార్టీలో న‌డుస్తోంది రాహుల్ గాంధీ కాలం కాదు రాహు కాలం అంటూ సెటైర్లు వేసింది.

సీనియ‌ర్ స‌భ్యులు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్తుండ‌టం, కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్య‌తిరేకిస్తూ కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు ఆ పార్టీపై తిరుగుబాటు చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈ మేర‌కు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ అమృత కాలం కాదు అని.. దేశంలో 2014 నుంచి రాహు కాలం న‌డుస్తోంద‌ని కాంగ్రెస్ నేత ఒక‌రు త‌న ప్ర‌సంగంలో ఆరోపించారు.

దీనికి స్పంద‌న‌గా రాజ్య‌స‌భ‌లో ఇవాళ బడ్జెట్‌పై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం అమృత కాలంలో ఉంద‌ని, కాంగ్రెస్ పార్టీలో రాహు కాలం న‌డుస్తోంద‌ని మంత్రి సీతారామ‌న్ ఆరోపించారు.  రాహు కాలం ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ ఆ ప్ర‌భావానికి గురైంద‌న్నారు. రాహు కాలంలో ఉండ‌డం వ‌ల్లే ఆ పార్టీకి 44 సీట్లు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లు మంత్రి నిర్మ‌ల విమ‌ర్శించారు.

కొద్దికాలం క్రితం సుమారు 23 మంది కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఆ పార్టీ వైఖ‌రిని ఖండిస్తూ అధిష్టానికి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యాన్ని ఉటంకిస్తూ, రాహు కాలం వ‌ల్లే కాంగ్రెస్‌లో జీ-23 ఉత్పాతం మొద‌లైన‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియ‌ర్లు ఆ పార్టీని వీడి వెళ్తున్నార‌ని ఇది ఆ పార్టీలోని రాహు కాలానికి ఉదాహ‌ర‌ణ అవుతుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ రాజ‌స్థాన్‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌తి రోజూ ఏదో కీడు జ‌రుగుతోందని, అక్క‌డ రాహు కాలం ఉంద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ వ్యాఖ్యానించారు.