ఆ టీడీపీ అనుబంధ సంఘాల జాడేదీ?

తెలుగుదేశం పార్టీకి వ‌చ్చే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు చావోరేవో లాంటివి. ఆ పార్టీకి రాజ‌కీయ మ‌నుగ‌డ ఉండాల‌న్నా.. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి పొలిటిక‌ల్ భ‌విష్య‌త్ ఉండాల‌న్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వాలి. అందుకోసం బాబు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌ల్లో మునిగిపోయారు. పార్టీని తిరిగి అధికారంలోకి తేవ‌డం కోసం శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే పార్టీని స‌మాయ‌త్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నకు పార్టీ అనుబంధ సంఘాల తీరు అసంతృప్తిని క‌లిగిస్తోంద‌ని స‌మాచారం.

పార్టీ అధికారంలో ఉన్న‌పుడు తెలుగు మ‌హిళ‌, తెలుగు యువ‌త‌, తెలుగు రైతు, టీఎన్టీయూసీ ఇలా అనేక అనుబంధ సంఘాలు యాక్టివ్‌గా ప‌నిచేశాయి. కానీ ఇప్పుడు వాటిల్లో ఆ జోరు లేదు. ప్ర‌స్తుతం టీడీపీ అనుబంధ సంఘాల జాడే క‌నిపించ‌డం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలిగా వంగ‌ల‌పూడి అనిత ఉన్నా ఆమె మీడియా సమావేశాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు.

ప్రభుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల్లో పెద్ద‌గా పాల్గొన‌డం లేదు. ఇటీవ‌ల నారీ దీక్ష పేరుతో కొంత హడావుడి చేసినా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయార‌ని టాక్. కేవ‌లం మ‌హిళా సంఘం ఉందంటే ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక తెలుగు యువ‌త ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. తెలుగు యువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న చిత్తూరు జిల్లా నేత శ్రీరామ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయార‌ని అంటున్నారు.

రైతు స‌మ‌స్య‌ల‌పై పార్టీ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేపట్టిన తెలుగు రైతు సంఘం క‌నిపించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తెలుగు రైతు అధ్య‌క్షుడిగా ఉన్న శ్రీనివాస‌రెడ్డి వాయిస్ పెద్ద‌గా వినిపించ‌డం లేదు. ఇక తెలుగు విద్యార్థి విభాగం కూడా అలాగే ఉంది. గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు టీడీపీ నేత‌లు ఏ కార్య‌క్ర‌మం చేయాల‌న్నా అనుబంధ సంఘాల నుంచి నేత‌లు, కార్య‌వ‌ర్గం పెద్ద ఎత్తున త‌ర‌లివంచేది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేద‌ని పార్టీ నేత‌లే అంటున్నారు. బ‌య‌ట నుంచి ప్ర‌జ‌ల‌ను తీసుకు రావాల్సి వ‌స్తుంద‌ని వాపోతున్నారు. పార్టీ అనుబంధ సంఘాలు బ‌ల‌హీనంగా ఉండ‌డంతో ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా జ‌న‌బ‌లం క‌నిపించ‌డం లేద‌ని చెబుతున్నారు. ఈ సంఘాల‌ను బ‌లోపేతం చేయ‌డంపై బాబు ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని కోరుతున్నారు.