రేవంత్ రెడ్డి… ఆట‌లో అర‌టిపండు

తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌థి, ఎంపీ రేవంత్ రెడ్డి రాజ‌కీయాల్లో స్వ‌ల్ప‌కాలంలోనే ఈ స్థాయికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఎంద‌రో సీనియ‌ర్లు ఉండ‌గా, వారిని కాద‌ని కాంగ్రెస్ ముఖ్యులు ఆయ‌న్ను పీసీసీ ఛీఫ్ ప‌ద‌వికి ఎంపిక చేశారు. ఈ బాధ్య‌త‌ల స్వీకారం త‌ర్వాత పార్టీ బ‌లోపేతం చేసేందుకు త‌న‌దైన శైలిలో రేవంత్ కృషి చేస్తుంటే… ఆయ‌న్ను ఆటలో అర‌టిపండు చేసేలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ, కేంద్రంలో ప‌రిపాలిస్తున్న బీజేపీ స్కెచ్ వేయ‌డ‌మే కాకుండా దాన్ని విజ‌యవంతంగా అమ‌లు చేస్తున్నాయ‌ని అంటున్నారు. తాజా ప‌రిణామాలు దీనికి కార‌ణంగా చెప్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మ‌ళ్లీ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న అంశం తెర‌మీద‌కు రావ‌డంతో తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని సరైన సమయంలో టీఆర్ఎస్ అందిపుచ్చుకుంది. క్షేత్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు చేయ‌డంతో పాటు  ప్రధానిపై ప్రివిలెజ్ మోషన్ పేరుతో పార్లమెంటు ఉభయ సభల్లో టీఆర్ఎస్ నోటీసులు ఇచ్చింది.

ప్రధాని వ్యాఖ్యలపై ప్రివిలేజ్‌ మోషన్ నోటీసు ఇచ్చి బడ్జెట్ సమావేశాలను బహిష్కరించింది. కేంద్రం నుంచి క్లారిటీ వచ్చేంత వరకు హాజరయ్యేది లేదంటూ టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. త‌ద్వారా చివరకు ప్రతిపక్షాలను కూడా ఈ ఉచ్చులోకి లాగే డ్రామాలో రెండు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సక్సెస్ అయ్యాయి.

ఇక్క‌డే కాంగ్రెస్ పార్టీ ఆట‌లో అర‌టిపండు అయిపోయింద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. ఎందుకంటే, తెలంగాణ‌లో టీఆర్ఎస్ , బీజేపీ రెండు పార్టీల ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్. ఇప్పటికే తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ మాత్రమే అనే సందేశాన్ని తెలంగాణలో టీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ చేసుకుంది. తాజా వివాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని సెంటిమెంట్ అస్త్రంగా వాడుకోడానికి ప్రధాని తనదైన శైలిలో ప్రచారాస్త్రంగా అందించారు.  ప్రధాని వ్యాఖ్యలను, బీజేపీని ఎంత ఎక్కువగా తిట్టిపోస్తే టీఆర్ఎస్‌కు అంతగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇదే సమయంలో టీఆర్ఎస్‌ను ఖండించడానికి బీజేపీ కూడా తన వంతు నిరసనలతో రోడ్డెక్కుతుంది. ఈ రెండు పార్టీల మధ్యలో కాంగ్రెస్ సోదిలో లేకుండా పోతుంది. ఈ రెండు పార్టీల ఉమ్మడి లక్ష్యం అదే.  మొత్తంగా రేవంత్ ఆట‌లో అర‌టిపండుగా మార్చే గేమ్ లో టీఆర్ఎస్ , కాంగ్రెస్ విజ‌యం సాధించింద‌ని అంటున్నారు.