ఆంధ్రావనిలో కొత్త పీఆర్సీకి సంబంధించి వివాదం నడుస్తోంది.ఉద్యోగులు,ఉపాధ్యాయులు రెండు వర్గాలుగా విడిపోయి తమ వాదన వినిపిస్తున్నారు.మంత్రుల కమిటీతో చర్చలు జరిగిన అనంతరం పరస్పర ఒప్పందం మేరకు మినిట్స్ రూపొందించాక కూడా ఉపాధ్యాయులు శాంతించడం లేదు..సరికదా ఉద్యమ తీవ్రతను పెంచారు.తాము పీఆర్సీ సాధన సమితి నుంచి బయటకు వచ్చేశామని యూటీఎఫ్,ఎస్టీయూ,ఏపీటీఎఫ్ (1938) లాంటి ఉద్యమ సంఘాలు నిన్నటి వేళ ప్రకటించాయి.ఇదే సమయంలో జగన్ తరఫు పెద్దలు మాత్రం ఇప్పటికీ తాము ఆ రోజు చెప్పిన మాటలకు కట్టుబడే ఉన్నామని,ఉపాధ్యాయులే మాట మార్చి రాజకీయం చేయడం తగదని అంటున్నారు.చర్చల్లోనే తమ సమస్యలు చెబితే పరిష్కారానికి ప్రయత్నించేవాడినని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన వివరణ ఇస్తున్నారు.
చీకటి జీఓల ఉపసంహరణ లేకుండా ఏ విధంగా చర్చలకు ఒప్పుకున్నారని ఉపాధ్యాయులు ఆ నలుగురు నాయకుల నూ నిలదీస్తున్నారు. చర్చల్లో పాల్గొన్న బండి శ్రీను,కేఆర్ సూర్యనారాయణ,వెంకట్రామి రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు అంతా చేశారని అంటూ వారిపై అనేక అభియోగాలు వినిపిస్తున్నారు.కానీ ఇదే బొప్పరాజు కానీ లేదా చంద్రశేఖర్ రెడ్డి (ఒకనాటి ఎన్జీఓ రాష్ట్ర సంఘ అధ్యక్షులు,ఇప్పటి ప్రభుత్వ సలహాదారు)కానీ పరుచూరి అశోక్ బాబు కానీ చంద్రబాబు హయాంలో అనుకున్నవన్నీ సాధించుకుని వచ్చారని చెబుతూ, చంద్రబాబుకు జగన్ కు ఉన్న తేడాలేంటన్నవి చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో తాము 43 శాతం ఫిట్మెంట్ పొందామని, అదేవిధంగా ఇరవై శాతం హెచ్ఆర్-ను శ్రీకాకుళం, చిత్తూరు, మచిలీపట్నం లాంటి ప్రాంతాలలో లక్ష జనాభా లేకపోయినా కూడా అంగీకరించారని చెబుతున్నారు.
అదేవిధంగా సమైక్యాంధ్ర ఉద్యమ కాలానికి సంంబంధించి 81రోజులనూ స్పెషల్ లీవ్ గా పరిగణించి సంబంధిత ఆర్థిక ప్రయోజనం దక్కించారని అంటూ నాటి చంద్రబాబు నిర్ణయాలను ఉద్యోగులు కొనియాడుతున్నారు. ఏ విధంగా చూసినా ప్రస్తుత పీఆర్సీ అన్ని విధాలా తమకు నష్టమేనని మరో మారు ఉపాధ్యాయులు రోడ్డెక్కేందుకు సిద్ధం అవుతున్నారు. అసలు చలో విజయవాడను సక్సెస్ చేసిందే తాము అని అంటున్నారు. ఎన్నో పోలీసు ఒత్తిళ్లను దాటుకుని, మారు వేషాల్లో రైళ్లలో,బస్సుల్లో విజయవాడకు చేరుకుని, అలుపెరుగని పోరాటానికి తామే స్ఫూర్తి అయ్యామని చెబుతున్నారు. కానీ నాటి స్ఫూర్తి ఉద్యోగ సంఘాల నాయకుల్లో లేకుండా పోయిందని మండిపడుతున్నారు.అందుకే గురువు అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అని మరోమారు గుర్తు చేసేందుకు, ఇదే సమయంలో కాంట్రాక్టు లెక్చరర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో కలిసి ఉద్యమించేందుకు వీరంతా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
కోరుకున్న రీతిలో తమకు ఫిట్మెంట్ దక్కలేదని ఆరోపిస్తూ వీళ్లంతా ఉద్యమ బాటకు సన్నద్ధం అవుతున్నారు.ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబే తమ దృష్టిలో సూపర్ సీఎం అని అంటున్నారు.ఆ రోజు ఆయన ఇచ్చినన్ని వరాలు జగన్ ఇవ్వలేకపోగా,తమను అవమానిస్తున్నారని వీరంతా వేదన చెందుతున్నారు.చర్చల సందర్భంగా నిరసనల సమయంలో తాము వాడిన భాష విషయమై క్షమాపణలు చెప్పామని, కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యమాన్నికట్టడి చేసేందుకు మరియు అణచి వేసేందుకు తమపై తీసుకున్న పోలీసు చర్యల విషయమై మౌనం వహించడం కూడా మంచిది కాదని వీరు హితవు చెబుతున్నారు.గతంలో ఇదే విధంగా చంద్రబాబు వ్యవహరించి చాలా నష్టపోయారని,ఇప్పుడు జగన్ కూడా అదే తప్పు చేయవద్దని వీరంతా వేడుకుంటూ ఉన్నారు.